జస్టిస్ పీబీ సావంత్ ఇక లేరు

15 Feb, 2021 12:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ  న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ పీబీ సావంత్ (91 ) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఈ రోజు (ఫిబ్రవరి 15 సోమవారం) పూణేలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. రేపు ఉదయం పూణేలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. పూణేలో జరిగిన మొదటి ఎల్గార్ పరిషత్తుకు సమావేశానికి పీబీ సావంత్ అధ్యక్షత వహించారు. క్రమశిక్షణ గల న్యాయమూర్తిగా పేరుగాంచిన సావంత్‌ అనేక కీలకమైన తీర్పులను వెలువరించారు. 1995 లో పదవీ విరమణ  అనంతర అనేక సామాజిక, ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు.

సావంత్‌ అకాలమృతిపై పలువురు న్యాయవాదులతోపాటు, ఉదమ్యనేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. ప్రజా ఉద్యమాలకు ఆయన లేని తీరనిదంటూ పౌర హక్కుల కార్యకర్త  తీస్తా సెతల్వాద్‌ నివాళులర్పించారు. న్యాయమూర్తిగా, కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా ప్రతీరంగంలోనూ రాణిస్తూ ప్రజా జీవితాన్ని గడిపిన ఆయన తామకు స్ఫూర్తి అని ప్రముఖ కార్యకర్త జస్టిస్ బిజి కోల్సే-పాటిల్ పేర్కొన్నారు. జస్టిస్ సావంత్ సామాజిక-న్యాయ రంగాలలో మంచి సంస్కర్త అనీ, న్యాయ వృత్తి ద్వారా సామాజిక న్యాయం కోసం పనిచేయమంటూ యువ న్యాయవాదులకు మార్గనిర్దేశనం  చేసిన గొప్ప వ్యక్తి అని న్యాయవాది అసిమ్ సరోడ్ గుర్తు చేసుకున్నారు.  న్యాయవాదిగా న్యాయానికి కట్టుబడి ఉండటమేకాదు, అణగారిన వర్గాల  ఉద్యమాలకు అండగా నిలిచారంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ట్వీట్‌ చేశారు. జస్టిస్ సావంత్‌కు భార్య జయశ్రీ, న్యాయవాది కుమారుడు విశ్వజీత్, ఇద్దరు కుమార్తెలు సుజాత, రాజశ్రీ ఉన్నారు.

జూన్ 30, 1930 న జన్మించిన పీబీ సావంత్‌  ముంబై విశ్వవిద్యాలయం నుండి న్యాయ డిగ్రీ (ఎల్‌ఎల్‌బి) పొందారు. అనంతరం ముంబై హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. 1973లో ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా, 1989లో సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రధానంగా 2003లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నవాబ్ మాలిక్, పద్మసింగ్ పాటిల్, సురేష్ జైన్ విజయకుమార్ గవిత్ లపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు సావంత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2005 ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా నవాబ్ మాలిక్, పద్మసింగ్ పాటిల్,  సురేష్ జైన్ లపై అభియోగాలు నమోదయ్యాయి ఫలితంగా, ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సురేష్ జైన్, నవాబ్ మాలిక్ రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు