మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఊరట.. ఎట్టకేలకు జైలు నుంచి విడుదల!

27 Dec, 2022 19:11 IST|Sakshi

ముంబై: నెలకి రూ.100 కోట్లు వసూళ్లకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఊరట లభించింది. ఆయన బెయిల్‌ మంజూరుపై స్టే పొడగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. దీంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. 

డిసెంబర్‌ 12న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు జస్టిస్‌ ఎంఎస్‌ కర్నిక్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అయితే, సుప్రీం కోర్టులో సవాల్‌ చేసేందుకు 10 రోజుల సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడింది. గత వారం సీబీఐ అభ్యర్థన మేరకు డిసెంబర్‌ 27 వరకు బెయిల్‌పై స్టే విధించింది బాంబే హైకోర్టు.  సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం శీతాకాల సెలవుల్లో ఉంది. దీంతో కేసు విచారణ 2023, జనవరిలోనే జరగనుంది. దీంతో మరోసారి స్టే పొడిగించాలని కోరింది దర్యాప్తు సంస్థ. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించిన క్రమంలో మాజీ మంత్రి దేశ్‌ముఖ్‌ బుధవారం జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. 

ఇదీ కేసు..
అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్‌ కేసులో గతేడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో గత అక్టోబర్‌లోనే బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సీబీఐ కేసులో స్పెషల్‌ కోర్టు ఆయనకి బెయిల్‌ నిరాకరించింది. దీంతో బెయిల్‌ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు .. క్షణాల్లోనే షాక్‌!

మరిన్ని వార్తలు