బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్‌దా!

1 Sep, 2020 03:36 IST|Sakshi

ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం

ఇందిర టు సోనియా.. గాంధీ కుటుంబానికి విధేయ నేత

పార్టీలో, ప్రభుత్వంలో ట్రబుల్‌ షూటర్‌గా ప్రఖ్యాతి

రాష్ట్రపతిగా ‘పదవీ’ విరమణ

న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్‌ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్‌ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు.

తండ్రి సమరయోధుడు  
1935 డిసెంబర్‌ 11న అప్పటి బ్రిటిష్‌      ఇండియాలో భాగమైన బెంగాల్‌ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని బీర్బుమ్‌ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్‌ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు        రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్‌ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్‌ శాసన మండలిలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం),    ఎల్‌ఎల్‌బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌(పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు.

1969 నుంచి అప్రతిహతంగా..
1969లో ప్రణబ్‌ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్‌ విజయంలో ప్రణబ్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్‌ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్‌ సింగ్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించింది ప్రణబ్‌ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్‌ 2గా ప్రణబ్‌ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్‌ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్‌ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు.  

► ప్రణబ్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ), ఆఫ్రికన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లలో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యులుగా ఉన్నారు.  
► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఇన్‌ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి.  
► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి.   

కుటుంబం
ప్రణబ్‌కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్‌. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్‌ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు.  

47 ఏళ్లకే ఆర్థికమంత్రి
అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్‌ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు.

ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు.  ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్‌కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి.

దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్‌ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్‌– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్‌ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్‌ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది.

ప్రధాని కాలేకపోయారు
1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్‌ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్‌ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్‌గాంధీతో సయోధ్య  అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్‌ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్‌ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు.  సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్‌ వ్యూహమే కారణమని భావిస్తారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్‌  పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్‌ ప్రధాని అయ్యారు.  మన్మోహన్‌ కేబినెట్‌లోనూ ప్రణబ్‌ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్‌ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్‌లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్‌తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు.

మూడోసారి... కలిసొచ్చింది
ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్‌ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్‌పూర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్‌ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్‌ ఇయర్స్‌’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్‌సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను.

ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్‌ కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్‌ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్‌ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్‌ హస్నత్‌ ఖాన్‌ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్‌ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్‌ ముర్షిదాబాద్‌కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట.  

నాలుగో పుస్తకం...
రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్‌ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్‌ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్‌ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్‌ డికేడ్‌ (2014), ది టర్బులెంట్‌ ఇయర్స్‌ (2016), ది కొయలిషన్‌ ఇయర్స్‌ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్‌ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్‌ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్‌ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు.   


2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్‌ముఖర్జీ


రాష్ట్రపతి కోవింద్‌ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్‌


దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్‌ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు