అమిత్‌ షా సమక్షంలో బీజేపీలోకి సువెందు అధికారి

19 Dec, 2020 16:21 IST|Sakshi

 బీజేపీలో చేరిన ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బెంగాల్‌లో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా పలువురు టీఎంసీ నేతలను తమ వైపుకు తిప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో  టీఎంసీ మంత్రి సువెందు అధికారి శనివారం హోంమంత్రి   అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.   మిడ్నాపూర్‌ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ర్యాలీలో  సువేందు, సుదీప్‌ ముఖర్జీ సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు కాషాయ గూటికి చేరారు. వీరిలో ఆరుగురు టీఎంసీ పార్టీకి చెందినవారే. మరో  ఎంపీ సునీల్‌ మండల్‌ కూడా షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీలోని విభేదాల ‍ కారణంగా టీఎంసీకి గుడ్‌బై చెప్పిన సువేందు..తన రాజీనామా లేఖలో పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే టీఎంసీ సభ్యునిగా ఇప్పటివరకు తనకు ఇచ్చిన అవకాశాలకు మమతా బెనర్జీకి కృతఙ్ఞతలు తెలిపారు.  (మమతకు వరుస షాక్‌లు.. బీజేపీ సెటైర్లు! )

 కాగా సువెందు అధికారికి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నిర్ణయించింది. బీజేపీలో చేరిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమరార్హం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకనేతలు పార్టీని వీడటంతో మమతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి సహా మిడ్నాపూర్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ కూడా తమ పదవులకు  రాజీనామా చేశారు. మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్‌ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు  మరికొంతమంది టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతోంది. ముకుల్‌ రాయ్‌ సహకారంతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. (కేంద్రంపై మండిపడ్డ మమతా బెనర్జీ )

మరిన్ని వార్తలు