Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

13 Jan, 2023 08:24 IST|Sakshi

సీనియర్‌ రాజకీయవేత్త, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌(ఎల్‌జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల శరద్‌ యాదవ్‌ గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ట్విటర్‌ ద్వారా ధ్రువీకరించారు. అనారోగ్యం పాలై అపస్మారక స్థితికి చేరుకున్న యాదవ్‌ను తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స ప్రారంభించామని, నాడి పనిచేయలేదని, రక్తపోటు రికార్డు కాలేదని ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది.

రాత్రి 10.19 గంటలకు మరణించారని తెలియజేసింది. శరద్‌ యాదవ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శరద్‌ యాదవ్‌ మొత్తం పదిసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1970వ దశకంలో  జయప్రకాశ్‌ నారాయణ్‌ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సోషలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

జనతాదళ్‌ నుంచి బయటకు వచ్చి 1997లో జేడీ(యూ)ను స్థాపించారు. జేడీ(యూ) నితీశ్‌ వర్గానికే చెందుతుందని 2017లో ఈసీ ప్రకటించింది. 2018లో తాను స్థాపించిన ఎల్‌జేడీని శరద్‌ యాదవ్‌ ఇటీవలే జేడీ(యూ)లో విలీనం చేశారు. శరద్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు