‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’

5 Aug, 2020 09:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చారిత్రక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కేవలం మత కార్యక్రమం కాదని, ఇదొక సాంస్కృతిక పునరుజ్జీవనమని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తెలిపారు. మూడేళ్లలో మందిర నిర్మాణం పూర్తవుతుందని బుధవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రాముడి ఇతిహాసంతో పాటు వంశ చరిత్రతో 70 ఎకరాల్లో మందిర నిర్మాణం జరుగుతుందని, వీహెచ్‌పీ రూపొందించిన నమూనాతోనే నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మూడు అంతస్థులతో రామమందిర నిర్మిస్తున్నట్లు, మొదటి అంతస్తులో బాలరాముడు, రెండో అంతస్తులో దర్బార్, మూడో అంతస్తులో రాముడి గురువుల విగ్రహాలు ఉంటాయని తెలిపారు. 70 ఎకరాల ఆలయ ప్రాంగణంలో రాముడి వంశం ఇక్ష్వాకుల వంశ చరిత్ర మొత్తం ఉంటుందన్నారు. రాముడి ఆదర్శాలు ఈ కాలానికి కూడా ఆచరణీయమైనవన్నారు.(భూమిపూజకు అయోధ్య సిద్దం)

రాముడి రాజ్యంలో విద్య, వైద్యం, అంగట్లో సరుకు కాదని, రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాఘవులు పేర్కొన్నారు. పేదరికం లేనిదే రామ రాజ్యమని, రాముడి విగ్రహాలను పూజించడం అంటే ఆయన సద్గుణాలను ఆచరించడమేనని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన 1989లోనే జరిగిందని, 1989లో దళితుడితో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. సాధు సంతుల సమక్షంలో కామేశ్వర్ చౌపాల్ అనే దళితుడు తొలి ఇటుక పెట్టినట్లు తెలిపారు. అయోధ్య రామాలయం ట్రస్ట్‌లో దళితుడు ఒక ట్రస్టీగా ప్రస్తుతం ఉన్నారన్నారు. ఇప్పుడు జరిగేది ఇది కేవలం రామమందిర నిర్మాణ పనుల ప్రారంభం కోసం జరిపే భూమి పూజ మాత్రమేనని, అయోధ్య భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ భూమిపూజ నిర్వహిస్తున్నారని తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు)

‘ఇఫ్తార్ లాంటి కార్యక్రమాలకు సైతం అనేక మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. భూమి పూజ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు. కాశీ, మధురపై ఉద్యమం చేయాల్సిన అవసరం రాదు. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించుకోవడమే ఉత్తమం. ఒకరి ధర్మంపై మరొకరు దాడులు చేయడం సరి కాదన్నదే అయోధ్య రామమందిర నిర్మాణం సందేశం. హిందుత్వం అంటే సెక్యులర్ సర్వధర్మ సమభావన మన నరనరాల్లో ఉంది. భారత దేశంలోనే అత్యధిక మసీదులు, చర్చిలు ఉన్నాయి. అందరం సోదరుల్లా జీవిస్తున్నాం. విదేశీ దురాక్రమణ దారుడు బాబర్ రామజన్మభూమిలో ఉన్న మందిరాన్ని దురుద్దేశంతో పడగొట్టారు. వాటిని తిరిగి నిర్మించడం అంటే  సంస్కృతిని పునరుద్ధరించడమే. ఈ రోజు అత్యంత ఆనందకరమైన రోజు. అయిదు శతాబ్దాల చరిత్రలో జరిగిన సంఘర్షణలో ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు శాంతిస్తాయి’ అని రాఘవులు పేర్కొన్నారు. (సయోధ్యకు అంకురార్పణ)

మరిన్ని వార్తలు