వేకువజామున భారీ విస్పోటనం.. నలుగురి మృతి.. ఛిద్రమైన..

1 Jan, 2023 08:13 IST|Sakshi
మృతులు తిల్లైకుమార్, ప్రియాంక, సెల్వి(ఫైల్‌)  

సాక్షి, చెన్నై(సేలం): నామక్కల్‌ జిల్లా మోగనూరు శనివారం వేకువజామున బాణసంచా మోతతో దద్దరిల్లింది. ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులకు గ్యాస్‌ సిలిండర్ల పేలుడు తోడు కావడంతో భారీ విస్పోటనం జరిగింది. ఐదు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నలుగురి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. కొన్ని గంటల పాటుగా శ్రమించి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

వివరాలు.. నామక్కల్‌ జిల్లా మోగనూరుకు చెందిన తిల్‌లైకుమార్‌ (35) బాణసంచా వ్యాపారి. ఆయనకు ఓడ పాళయంలో గోడౌన్‌ కూడా ఉంది. మోగనూరు మేట్టు వీధిలోని నివాసంలో భార్య ప్రియాంక(30), కుమార్తె సజనీ(4), తల్లి సెల్వి(55)తో తిల్‌లైకుమార్‌ నివాసం ఉన్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా బాణసంచా వ్యాపారం అధికంగా జరిగే అవకాశం ఉండడంతో శివకాశి నుంచి స్టాక్‌ను శుక్రవారం రాత్రి ఓ మినీ వ్యాన్‌లో  మోగనూరుకు తెప్పించాడు. గోడౌన్‌కు తరలించకుండా ఇంటి వద్దే ఓ గదిలో స్టాక్‌ను ఉంచి నిద్రకు ఉపక్రమించాడు.  

ఉలిక్కి పడ్డ మోగనూరు.. 
శనివారం వేకువ జామున రెండున్నర గంటల సమయంలో మోగనూరు ఉలిక్కి పడింది. భారీ విస్పోటనం తరహాలో శబ్దాలు రావడంతో జనం నిద్ర నుంచి లేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తిల్లైకుమార్‌ ఇంటి నుంచి మంటలు చెలరేగుతుండడంతో అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. ఈ ఇంటికి పక్క పక్కనే ఉన్న ఇళ్లలోని వారంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. క్షణాల్లో బాణసంచా మోతకు తోడు గ్యాస్‌ సిలిండర్లు పేలిన శబ్దాలతో స్థానికుల్లో కలవరం బయలు దేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. 3 గంటల పాటు బాణసంచా మోతతో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. 

నాలుగు సిలిండర్లు కూడా.. 
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనుమతి లేకుండా ఇంటిలో బాణసంచా ఉంచడంతో పాటు విద్యుత్‌ స్విచ్‌ బోర్డుల వద్ద టపాకాయల బాక్సులను ఉంచడంతో విద్యుదాఘాతం ఏర్పడి ఉండవచ్చుననే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న రెండు, పక్కింట్లో ఉన్న మరో రెండు సిలిండర్లు పేలడంతో భారీ విస్పోటనం జరిగినట్లు తేల్చారు. సమాచారం అందుకున్న మంత్రి మందివేందన్, ఎంపీ రాజేష్‌కుమార్, ఎమ్మెల్యే రామలింగం ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.  ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రు.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేసియా అందజేశారు.   

ఛిద్రమైన మృతదేహాలు.. 
ఈ పేలుడు ధాటికి తిల్లైకుమార్‌ ఇంటితో పాటు పక్క పక్కనే ఉన్న మరో నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇళ్ల ఆనవాళ్లే లేని విధంగా పరిస్థితి మారింది. ఆ ఇంటికి 50 అడుగుల దూరంలో మరో ఇంటి పై కప్పు పై ఛిద్రమైన తిల్లైకుమార్‌ మృతదేహం బయట పడింది. మంటలకు అతడి భార్య ప్రియాంక, తల్లి సెల్వి సజీవ దహనమయ్యారు. అయితే వీరి ఇంటికి పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్న యువకుడు సాహసం చేసి రక్షించడంతో సజినీ గాయాలతో బయట పడింది.

మరో ఇంట్లో ఉన్న పెరియక్క(73) ప్రమాద సమయంలో బీరువాలో ఉన్న నగదు కోసం లోనికి వెళ్లి పేలుడు కారణంగా మరణించింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుగా నమోదైంది. పక్క పక్క ఇళ్లల్లో ఉన్న కార్తికేయన్‌(28) అన్బరసి (25), సెంథిల్‌(45), పళనియమ్మాల్‌ (60) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. అలాగే, సుమిత్ర(38), రమేష్‌ (44), ముత్తులక్ష్మి (60), ప్రియాంక(22) జయమణి (50), సౌందరరాజన్‌ (50), ధనం (44), షణ్ముగ పెరుమాల్‌ (40), సజినీతో పాటు ఓ యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు