నలుగురు లష్కరే ముష్కరులు హతం

23 Mar, 2021 06:30 IST|Sakshi

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌: సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో భద్రతాదళాలు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని మనిహల్‌ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయని, మిలిటెంట్లను గుర్తించిన అనంతరం లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపగా నలుగురు తీవ్రవాదులు మరణించారని ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. వీరంతా తమను తాము లష్కరే ముస్తఫా వర్గంగా చెప్పుకుంటారని, కానీ పోలీసు రికార్డుల్లో వీరు లష్కరేతోయిబా తీవ్రవాదులనే ఉందని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో మూడు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్‌ స్వాధీనం చేసుకున్నారన్నారు. మృతులను రాయిస్‌ అహ్మద్‌ భట్, అమిర్‌ షఫి మిర్, రఖిబ్‌ అహ్మద్‌ మాలిక్, అఫ్తాబ్‌ అహ్మద్‌ వనిగా గుర్తించారు. సంఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడగా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ంతవరకు 9 ఎన్‌కౌంటర్లు జరిగాయని, వీటిలో 19మంది తీవ్రవాదులు హతమయ్యారని ఐజీ వివరించారు.  

తిరిగి వచ్చేయండి
ఈ సంవత్సరం 18 మంది యువకులు మిలిటెంట్లలో చేరారని, వీరిలో 5గురు ఎన్‌కౌంటరయ్యారని, ముగ్గురు అరెస్టయ్యారని, మిగిలిన వారు లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇలా ఏడుగురు యువకులు మిలిటెంట్లనుంచి తిరిగి వచ్చారన్నారు. సెక్యూరిటీ దళాలపై లోయలో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందన్నారు. స్థానిక యువతను తీవ్రవాదంవైపు మరల్చేందుకు పాకిస్థాన్‌ కుయుక్తులు పన్నుతోందని, సోషల్‌మీడియా ద్వారా రెచ్చగొడుతోందని విమర్శించారు. దీనికితోడు పాక్‌ డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తోందని, ఇలా డ్రగ్స్‌కు బానిసైనవారు తమను సంప్రదిస్తే డీఅడిక్షన్‌ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. యువతకు సాయం చేసేందుకు పోలీసులు సదా సిద్ధమన్నారు. లోయలో శాంతిస్థాపన తమ ధ్యేయమన్నారు. దళాలపై రాళ్లురువ్వే సంఘటనలు చాలా తగ్గిపోయాయని, గతంలోలాగా కాకుండా మిలిటెంట్లకు భయపడకుండా ప్రజా జీవనం కొనసాగుతోందని చెప్పారు. నిజానికి మిలిటెన్సీ కన్నా రాళ్లు రువ్వే ఘటనలు చాలా తీవ్రమైనవని, సామాజికంగా సీరియస్‌ సమస్యని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పలువురిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు