యూపీలో ‘నిర్భయ’ 

30 Sep, 2020 03:27 IST|Sakshi

హాథ్రస్‌ జిల్లాలో రెండు వారాల క్రితం దారుణం 

దళిత యువతిపై చిత్రహింసలు, సామూహిక అత్యాచారం 

తీవ్రంగా గాయపడిన యువతి; చికిత్స పొందుతూ మృతి 

ఈ ఘటనపై మండిపడిన భీమ్‌ ఆర్మీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు 

ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఆరోపణ 

నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశామన్న పోలీసులు

న్యూఢిల్లీ/హాథ్రస్‌: నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపర్చి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చనిపోయింది. తెగిన నాలుక, విరిగిన ఎముకలు, పూర్తిగా చచ్చుపడిపోయిన కాళ్లు, పాక్షికంగా పక్షవాతానికి గురైన చేతులు, మెడకు, వెన్నెముకకు అయిన తీవ్ర గాయాలు.. ఆ యువతిపై ఆ రాక్షసులు సాగించిన దమనకాండకు సాక్ష్యాలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు, నిర్భయ చట్టానికి కారణమైన 8 ఏళ్ల క్రితం నాటి నిర్భయ అత్యాచార ఘటనను ఈ దారుణం గుర్తుకు తెచ్చింది.

దళిత యువతి మృతిపై పౌర సమాజ కార్యకర్తలు, దళిత సంఘాలు, భీమ్‌ ఆర్మీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాయి. ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రి వెలుపల భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో వేలాది మంది ధర్నాకు దిగారు. ఆ దళిత యువతికి న్యాయం చేయాలని, దోషులను బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దళితులంతా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆజాద్‌ పిలుపునిచ్చారు. ఆటవిక రాజ్యం నడుస్తున్న యూపీలో మరో దళిత యువతి బలి అయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌లో, యూపీలోని హాథ్రస్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని హాథ్రస్‌ ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ తెలిపారు. సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనపై అత్యాచారం చేశారని, వారిని అడ్డుకుంటుండగా, గట్టిగా గొంతు నులిమారని, అప్పుడు నాలుక తెగిందని బాధిత యువతి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. బాధిత మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించకుండా.. పరిస్థితి పూర్తిగా విషమించిన తరువాత, సోమవారం సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రికి తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అలాగే, బాధితుల ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, నాలుగైదు రోజుల తరువాత కేసు నమోదు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.   
అసలేం జరిగింది.. 
సుమారు రెండు వారాల క్రితం, సెప్టెంబర్‌ 14న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హాథ్రస్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, బాధితురాలి సోదరుడు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆ రోజు ఉదయం పశువులకు గడ్డి కోసేందుకు తల్లి, అన్నతో కలిసి ఆమె పొలంకు వెళ్లింది. కాసేపయ్యాక గడ్డిమోపుతో ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వెళ్లాడు. యువతి తల్లికి కొద్ది దూరంలో ఉండి గడ్డి కోస్తుంది. ఇంతలో, వెనక నుంచి వచ్చిన ముష్కరులు ఆమె నోరు మూసి, చున్నీని మెడకు చుట్టి దూరంగా లాక్కెళ్లారు. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లి వెతకగా.. దారుణంగా అత్యాచారానికి గురై, రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించింది. మొదట, ఆమెను అలీçగఢ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే, చికిత్సకు స్పందించడం లేదని..మెడకు అయిన గాయం కారణంగా కాళ్లు పూర్తిగా, చేతులు పాక్షికంగా చచ్చుబడిపోయాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాంతో, ఆమెను సోమవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ వైద్యశాలకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. 

అరెస్ట్‌ చేశాం.. 
నిందితులు అగ్రవర్ణాలకు చెందిన వారయినందున, ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని వచ్చిన ఆరోపణలు సత్యదూరమని ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ తెలిపారు. ఆ నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని, బాధితురాలు మరణించినందున వారిపై పెట్టిన కేసుల్లో  హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్‌ను కూడా చేరుస్తామన్నారు.

8 రోజులు ఏం చేశారు? 
‘జవాబుల్లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఘటన జరిగిన తరువాత, ఫిర్యాదు అందిన తరువాత 8 రోజుల పాటు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? బాధిత యువతిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ నలుగురు రాక్షసులపై ఎన్‌ఎస్‌ఏ(నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ దారుణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియ ష్రినతే ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత యువతి మృతికి మొత్తం సమాజం సిగ్గుతో తల దించుకోవాలని ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఈ హత్యాచార ఘటనపై క్రికెటర్‌ కోహ్లి, బాలీవుడ్‌ ప్రముఖులు అక్షయ్‌ కుమార్, ఫర్హాన్‌ అఖ్తర్‌ ఆవేదనను వ్యక్తపరిచారు.

వెల్లువెత్తిన నిరసనలు
దళిత యువతి హత్యాచారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రభుత్వం మా ఓపికను పరీక్షించవద్దు. వారిని ఉరి తీసేవరకు మేం విశ్రమించం’ అని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ స్పష్టం చేశారు. ఆమెను ఎయిమ్స్‌కు మార్చి, మరింత మెరుగైన చికిత్స అందించాలన్న తన విజ్ఞప్తిని యూపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ యువతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆజాద్‌ పేర్కొన్నారు.  

సమాచారం తీసుకున్నాం.. 
ఈ ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలు చెప్పాలని పోలీసులను ఆదేశించామని జాతీయ మహిళాకమిషన్‌ అధ్యక్షురాలు రేఖాశర్మ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.   

మరిన్ని వార్తలు