క్షణికావేశం.. తమిళనాడులో దారుణం!

9 Feb, 2023 07:20 IST|Sakshi

కడలూరులో ఘోరం 

భార్య, వదిన, అత్త, ఇద్దరు చిన్నారులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త 

ఆపై తనూ మంటల్లో దూకి ఆత్మహత్య 

సజీవ దహనమైన వదిన, ఇద్దరు చిన్నారులు  

భార్య, అత్త పరిస్థితి విషమం 

క్షణికావేశం.. ఓ కుటుంబాన్ని చిదిమేసింది. నలుగురి ప్రాణాలను మంటలకు ఆహుతి చేసింది. కడలూరుజిల్లాలో భార్యతో గొడవ పడిన ఓ భర్త అత్తారింటికి వెళ్లి మరీ ఘోరానికి పాల్పడ్డాడు. ఏకంగా ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడితో పాటు వదిన, అన్నెపుణ్యం ఎరుగని ఇద్దరు పసిబిడ్డలు నామరూపాల్లేకుండా పోయారు. భార్య, అత్త కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాతున్నారు.  

సాక్షి, చెన్నై: దంపతుల మధ్య విడాకుల వివాదం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భార్యపై కోపంతో భర్త.. ఏకంగా ఆమె కుటుంబాన్నే తగల బెట్టేశాడు. కడలూరు చెల్లాంకుప్పంలో జరిగిన ఈ ఘటన బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాలు.. స్థానిక పిళ్లయార్‌ వీధిలోని ఓ ఇంట్లో ప్రకాష్‌(35), తమిళరసి(31), ఏడాది వయసున్న కుమార్తె హాసిని, తమిళరసి తల్లి సెల్వి నివాసం ఉంటున్నారు.

తమిళరసి సోదరి ధనలక్ష్మికి రెండేళ్ల క్రితం దేవనంపట్నాకి చెందిన సద్గురుతో వివాహమైంది. వీరికి ఆరు నెలల మగ బిడ్డ ఉన్నాడు. ధనలక్ష్మి, సద్గురుల మధ్య నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విరక్తి చెందిన ధనలక్ష్మి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆమె తన ఆరునెలల బిడ్డతో సహా తమిళరసి ఇంటికి వచ్చేసింది. అయినప్పటికీ ధనలక్ష్మి, సద్గురు ఫోన్‌లో తరచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే ప్రకాష్‌ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంట్లో ధనలక్ష్మి, తమిళరసి, సెల్వి, పసి బిడ్డలు మాత్రమే ఉన్నారు. ఆగ్రహంతో ఇంట్లోకి వచ్చిన సద్గురు భార్య ధనలక్ష్మితో ఘర్షణ పడ్డాడు.

తర్వాత తన వెంట తెచ్చుకున్న క్యాన్‌లోని పెట్రోల్‌ను ఇంట్లో ఉన్న వారందరిపై పోసి నిప్పంటించాడు. ఆపై తానూ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తమిళరసి, ఇద్దరు పసిబిడ్డలు అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న ధనలక్ష్మి, అత్త సెల్వి, భర్త సద్గురును ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో సద్గురు కూడా మరణించాడు. మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధనలక్ష్మి, సెల్వి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స    అందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు