పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు!

22 Feb, 2021 19:30 IST|Sakshi

దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ(రూ.100) చేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ.100కు చేరువలో ఉన్నాయి. రికార్డుస్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు చూసి సామాన్య ప్రజానీకం వాహనం తీయాలంటేనే భయపడిపోతున్నారు. వారి ఆగ్రహాన్ని సోషలో మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ ఇంధన ధరల పెరుగుదలపై ప్రతి పక్షాలు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. 

చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను తగ్గించాలని ప్రతి పక్షాలు కోరుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో దేశంలోని 4 రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించాయి. త్వరలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి సుంకాలు తగ్గించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, మేఘాలయలలో పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర పన్నులు తగ్గించబడ్డాయి. తగ్గిన తర్వాత కూడా ఢిల్లీలోని డీజిల్ ధర ఈ మూడు రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. 

త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.1 వ్యాట్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లో మేఘాలయ పెట్రోల్‌పై లీటరుకు రూ.7.40, డీజిల్‌పై రూ .7.10 భారీగా తగ్గించినట్లు ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం జనవరిలోనే చమురు ధరలపై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. అటు అసోం కూడా కరోనా కారణంగా విధించిన అదనపు పన్ను రూ.5 తగ్గిస్తూ ఫిబ్రవరి 12న నిర్ణయం తీసుకుంది. పన్ను తగ్గింపు తరువాత పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.91.78, షిల్లాంగ్‌లో రూ .86.87, గౌహతిలో రూ .87.24, జైపూర్‌లో రూ .97.10గా ఉంది.

చదవండి:

సైనికుల కోసం సోలార్ టెంట్లు

భారీగా పెరిగిన ఉల్లి ధర

>
మరిన్ని వార్తలు