‘ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇంటర్నెట్‌’పై దాడి

13 Jul, 2021 04:35 IST|Sakshi

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్వేచ్ఛాయుత, బహిరంగ అంతర్జాలం(ఇంటర్నెట్‌) దాడికి గురవుతోందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) సుందర్‌ పిచాయ్‌ అన్నారు. తాజాగా ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమాచార వ్యాప్తిపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని, కొన్ని దేశాలు ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆక్షేపించారు. ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇంటర్నెట్‌ అనే ఆలోచనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి దీనివల్ల అనర్థాల కంటే మంచే ఎక్కువగా జరుగుతుందని సూచించారు.

సమాచార వ్యాప్తి చుట్టూ గోడలు కట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సమాచార ప్రవాహాన్ని అడ్డుకోరాదని చెప్పారు. భారత్‌లో సోషల్‌ మీడియా వేదికలు, వార్తా ప్రచురణ సంస్థలు, ఓటీటీ వెబ్‌సైట్లు, గూగుల్‌ వంటి సెర్చ్‌ ఇంజన్లపై నియంత్రణ విధించడమే లక్ష్యంగా  కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల భద్రత కోసమే ఈ నిబంధనలని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ నిబంధనలు వినియోగదారుల గోప్యత, వాక్‌ స్వాతంత్య్రపు హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ చట్టాలను తాము గౌరవిస్తామని, నిబంధనలు పాటిస్తామని సుందర్‌ పిచాయ్‌ గతంలోనే స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు