అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

18 Aug, 2022 04:57 IST|Sakshi

సంక్షేమ పథకాలను వద్దనలేం

వాటిని ఉచితాల గాటన కట్టలేం 

హామీలివ్వకుండా పార్టీలను అడ్డుకోలేం

ఉపాధి హామీతో ప్రజలకు గౌరవప్రద జీవితం

ఉచితానుచితాలను తేల్చడానికి త్వరలో కమిటీ

సీజేఐ పునరుద్ఘాటన

విచారణ ఆగస్టు 22కు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు.

తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది.

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు.   తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు.

అన్నింటిపైనా చర్చ: విపక్షాలు
పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్‌ తన ఇంటర్‌వీన్‌ అప్లికేషన్‌లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ తన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్‌ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది.

పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా
రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్‌ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే.

మరిన్ని వార్తలు