నగ్న వీడియో: ‘అంతకంటే మార్గం లేదు’

31 Aug, 2020 11:00 IST|Sakshi

రిషికేశ్‌లోని వేలాడే వంతెనపై ఫ్రెంచి యువతి వీడియో.. క్షమాపణ

డెహ్రాడూన్‌: ‘‘స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, చట్టాల మీద నాకు అంతగా అవగాహన లేదు. నా చర్యతో ఎవరి మనోభావాలైన గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి’’ అని ఫ్రెంచ్‌ యువతి మేరీ హెలెన్‌(27) ఆదివారం క్షమాపణ కోరారు. లైంగిక వేధింపులపై అవగాహన కల్పించేందుకు ఈ తరహా ప్రయోగం చేసినట్లు వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో గల ప్రముఖ పర్యాటక ప్రాంతం లక్ష్మణ్‌ ఝూలా(వంతెన)ను దర్శించిన హెలెన్‌ అక్కడ నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ఈ విషయం గురించి స్థానిక నేత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు గురువారం ఆమెను అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను బెయిలుపై విడుదల చేశారు. ‘‘ఆన్‌లైన్‌లో బీడ్‌ నెక్లెస్‌ల బిజినెస్‌ చేస్తున్నట్లు సదరు యువతి వెల్లడించింది. తన వ్యాపారానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విధంగా వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపింది’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హెలెన్‌ వాదన మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. (చదవండి: అత్యాచార ఆరోపణలన్నీ వారి పుణ్యమే)

ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘‘లక్ష్మణ్‌ ఝూలాపై అర్ధనగ్నంగా వీడియో తీసినప్పుడు నా చుట్టూ ఒక్కరు కూడా కనిపించలేదు. వీడియో కోసం ఆ వంతెనను ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. బ్రిడ్జ్‌ దాటుతున్న ప్రతిసారీ నేను వేధింపులకు గురవుతున్నట్లు అనిపించేది. నా భారతీయ సోదరీమణులు, నాలాంటి మహిళా ప్రయాణికులు ఇలాంటి చేదు అనుభవాలే ఎదుర్కొని ఉంటారన్న బాధ వెంటాడేది. ఈ దేశంలో అణగదొక్కబడుతున్న మహిళలకు నేను సాయం చేయాలనుకున్నాను.

విద్యకు దూరమై, బలవంతపు పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్న యువతుల బాధలు బహిర్గతం చేయాలనుకున్నాను. అందుకోసం నాకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో ఉన్న లక్ష్మణ్‌ ఝూలాకు చారిత్రక నేపథ్యం ఉంది. దాదాపు తొంభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వేలాడే వంతెనపై ప్రస్తుతం రాకపోకలు నిలిపివేశారు. దీని స్థానంలో ప్రభుత్వం కొత్త వంతెన నిర్మించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జరుగబోయే కుంభమేళా కోసం ఈ మేరకు నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ఫ్రెంచి యువతి ఇలా అక్కడ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఆమె అక్కడే స్థానిక హోటల్‌లో బస చేస్తున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా