Jayalalitha Death Case: మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం.. ఆడియో క్లిప్‌ వైరల్‌

20 Oct, 2022 14:43 IST|Sakshi

సాక్షి, చెన్నై: దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అనుమానాలు మాత్రం తొలగడం లేదు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సైతం సంచలనంగా మారింది. తాజాగా జయలలిత మృతి కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మరణానికి ముందు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. 

నేను బాధ పడుతుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఆపోలో సిబ్బందిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత మండిపడ్డారు. చికిత్స సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండటం, డాక్టర్లపై  చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జయలలిత ఆడియోను ఆస్పత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్‌ ఆర్ముగస్వామి నివేదికతో ఆడియో బయటకు వచ్చింది.

విదేశాలకు అవసరమా?
అదే విధంగా  2017లో చెన్నైలో తన ప్రెస్ మీట్ అనంతరం డాక్టర్ రిచర్డ్ బిల్ మాట్లాడిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జయలలిత వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని శశికళ ప్రశ్నించగా.. ఆమె తప్పక వెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వారు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జయలలితే స్వయంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని డాక్టర్‌ రిచర్డ్‌ బిల్‌ పేర్కొన్నారు.
చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్‌

ఆర్ముగస్వామి నివేదిక ఏం చెబుతోంది
ఇదిలా ఉండగా జయలలిత మరణంపై జస్టిస్‌ ఆర్ముగ స్వామి కమిషన్‌ 608 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను మంగళవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. ఇందులో కమిషన్‌ సూచించిన పలు కీలక అంశాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించింది. ఈ నివేదికలోనూ పలు అంశాలు శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి మరణించిన సమయంలో తేడా ఉండటం, జయలలితకు లండన్‌, అమెరికా వైద్యులు యాంజియో చికిత్సకు సిఫార్సు చేసినా చివరి వరకు అందించకపోవడంపై ఆర్ముగస్వామి కమిషన్‌ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

శశికళ విచారణకు ఆదేశం
సమగ్ర సమాచారం కోసం చిన్నమ్మ శశికళతోపాటు ఏడుగురు కీలక వ్యక్తులను పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. శశికళ, జయలలిత వ్యక్తిగత డాక్టర్‌ శివ కుమార్‌,  మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్‌, మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ వంటి పేర్లను ప్రత్యేకంగా సూచిస్తూ వీరిని విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ఇక జయలలిత, శశికళ మధ్య గతంలో నెలకొన్న గొడవల వివరాలను సైతం నివేదికలో పొందుపరిచింది. విచారణకు తనను ఆదేశించడంపై శశికళ స్పందించారు. నివేదికను ఊహాగానాలతో రూపొందించారని.. జయలలిత మరణాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్‌ 2016న మృతి చెందిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు