కళ్లె దుటే ముక్కలైంది

10 Aug, 2020 02:05 IST|Sakshi

మొదటి, ఆఖరి వరుసలపైనే ప్రభావం ఎక్కువ

కోళీకోడ్‌ విమాన ప్రమాదంపై సీఐఎస్‌ఎఫ్‌ ఐజీ సీవీ ఆనంద్‌

వర్షం, చిమ్మచీకటితో కష్టసాధ్యమైన సహాయ కచర్యలు

మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాం

సాక్షి, హైదరాబాద్‌ : కేరళలోని కోళీకోడ్‌ విమాన ప్రమాదంలో మొదటి, ఆఖరి 2–3 వరుసల్లోని సీట్లలో కూర్చున్నవారే తీవ్రంగా ప్రభావితమయ్యారని సీఐఎస్‌ఎఫ్‌ ఎయిర్‌పోర్ట్‌ సెక్టార్‌(సౌత్‌వెస్ట్‌) ఐజీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. కాక్‌పిట్‌ సైతం ప్రభావితం కావడంతోనే పైలట్, కో–పైలట్‌లు మరణించారన్నారు. మధ్య వరుస సీట్లలో కూర్చున్నవారిలో మృతులు, క్షతగాత్రులు లేరని పేర్కొన్నారు. ఆ దుర్ఘటనలో సీఐఎస్‌ఎఫ్‌ సహాయకచర్యలకు సంబంధించి సీవీ ఆనంద్‌ ఆదివారం వెల్లడించిన వివరాలివి...
 
పెరిమీటర్‌ గోడకు విమానం గుద్దుకుని.. 
కేవలం 3 కి.మీ. పొడవు టేబుల్‌ టాప్‌ రవ్‌వేతో కూ డిన కోళీకోడ్‌ విమానాశ్రయం చుట్టూ పెరిమీటర్‌ వాల్‌గా పిలిచే సరిహద్దు గోడ ఉంది. ఆ గోడకు ఉన్న ఎమర్జెన్సీ గేట్‌ నం.8 వద్ద శుక్రవారంరాత్రి ఏఎస్సై మంగళ్‌ సింగ్, పెరిమీటర్‌ గస్తీలో ఏఎస్సై అజిత్‌సింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు. రన్‌వే వీరికి 45–50 అడుగుల ఎత్తులో ఉంది. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించడంతోపాటు ఎయిర్‌ ఇండియాకు చెందిన దుబాయ్‌–కోళీకోడ్‌ బోయింగ్‌ 737 విమానం పెరిమీటర్‌ గోడకు గుద్దుకుని రెండు ము క్కలవడం గమనించారు. వెంటనే మంగళ్, అజిత్‌లు వైర్‌లెస్‌ సెట్స్‌ ద్వారా ఎయిర్‌పోర్ట్‌ కంట్రోల్‌కు, సమీపంలోని బ్యారెక్స్‌లో విశ్రాంతి తీసుకునే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్న ఐజీ సీవీ ఆనంద్‌ సీఐఎస్‌ఎఫ్‌ హెడ్‌– క్వార్టర్స్‌తోపాటు డీజీని అప్రమత్తం చేసి సహాయక చర్యల్ని పర్యవేక్షించడం ప్రారంభించారు.

సీఐఎస్‌ఎఫ్‌ కృషి ఫలితంగానే.. 
కాప్‌పిట్‌ పెరిమీటర్‌ గోడను బలంగా ఢీ కొట్టడంతో పైలట్‌ అక్కడికక్కడేతమరణించగా, కో–పైలట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సీఐఎస్‌ఎఫ్, ఇతర విభాగాలు, స్థానికుల కృషి ఫలితంగానే మృతుల సంఖ్య 18కి పరిమితమైంది. పైలట్‌ అప్రమత్తత, వర్షం కారణంగా విమానంలో ఉన్న ఫ్యూయల్‌కు మంటలంటుకోలేదు. అదే జరిగితే ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది.  

విమానం లైట్ల వెలుతురులో 
నడుచుకుంటూ... ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషనల్‌ ఏరియాకు లోపలే ప్రమాదం జరగడం, పెరిమీటర్‌ గోడకు అవతల రోడ్లు ఉండటంతో సిబ్బంది, అంబులెన్స్‌లు, జేసీబీలు, స్థానికులు ప్రమాదస్థలానికి చేరుకోవడం తేలికైంది. ఇది కూడా మృతుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. భారీవర్షం, చిమ్మ చీకటి వల్ల సహాయకచర్యలకు ఇబ్బంది కలిగింది. విమానంలోని మొదటి, చివరి 2–3 వరుసల్లో కూర్చున్న వారిలో అత్యధికులు సీట్ల మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడటం, చనిపోవడం జరిగింది. విమానం లైట్లు వెలుగుతూనే ఉండటంతో చాలామంది ఆ వెలుతురులో నడుచుకుంటూ బయటకు రాగలిగారు. ఫ్లాష్‌లైట్ల వెలుతురులో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 184 మంది ప్రయాణికులు, ఫ్లైట్‌ అటెండెంట్స్‌లో నలుగురు మినహా మిగిలినవారిని రాత్రి 9.45 గంటలకల్లా రెస్క్యూ చేయగలిగారు. విమానం నుంచి ఆఖరులో బయటకు తీసుకువచ్చిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మరిన్ని వార్తలు