తనకు ఓటు వేయలేదని గ్రామస్తులపై కక్ష.. పెద్ద గొయ్యి తవ్వి..

4 Mar, 2022 14:28 IST|Sakshi
గంగాబడ రోడ్డుకు అడ్డంగా ఉంచిన బండరాళ్లు

పర్లాకిమిడి(భువనేశ్వర్‌): పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి తనకు ఓటు వేయని గ్రామస్తులపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని గ్రామ రహదారిని దిగ్బంధం చేశాడు. రోడ్డుకు ఓ వైపు పెద్ద గొయ్యి తవ్వి.. మరోవైపు దారికి అడ్డంగా భారీ బండరాళ్లను ఉంచాడు. దీంతో కూలి పనులు, ఇతర అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన గజపతి జిల్లాలోని రాయఘడ సమితిలో ఉన్న ఏఓబీ(ఆంధ్రా–ఒడిశా బోర్డరు)లోని గంగాబడో పంచాయతీలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది.

ఇదంతా ఇక్కడి పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి, ఓటమి పాలైన బరిక శోబోరో అనే వ్యక్తి చేసిన నిర్వాకంగా తేలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేడీ మద్దతు అభ్యర్థిగా ఇతడు పోటీ చేశాడు. అయితే ఇక్కడి ప్రజలు ఇతడిని కాదని ఇండిపెండెంట్‌ అభ్యర్థి హారిబందు కార్జికి అండగా నిలిచి, అతడిని గెలిపించారు. దీంతో కోపంతో రగిలిపోయిన బరిక శోబోరో తనకు అధికార పార్టీ బీజేడీ అండ ఉందన్న అహంకారంతో గ్రామస్తులపై ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త సర్పంచ్‌ హారిబందు కార్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గారబంద పోలీసులు, గారబంద ఐఐసీ అధికారి సర్వేశ్వర సామంత్‌రాయ్, తహసీల్దారు లీలావతి ఆచార్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం రహదారి పునరుద్ధరణ పనులకు చర్యలు ముమ్మరం చేశారు.

  

మరిన్ని వార్తలు