ఇంధన‌ ధరలు తగ్గేది అప్పుడే: ‌ధర్మేంద్ర ప్రధాన్

26 Feb, 2021 17:28 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న సంగతి మనకు తెలిసిందే‌. కొన్ని రాష్ట్రాల్లో అయితే చమురు ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజానీకం బయటకి వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరల తగ్గింపు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రజలు ఏదైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. 
 
తాజాగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేడు మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని తెలిపారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందన్నారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

‘అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సీజన్‌ గడిస్తే ధరలు తగ్గుతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం చమురు ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రం విధించే పన్నులు అధికంగా ఉంటున్నాయని వారు తెలిపారు. వీలైనంతగా త్వరగా ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 

చదవండి:

పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్

ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు

>
మరిన్ని వార్తలు