Karnataka Coriander Prices: కేక పుట్టిస్తున్న కొత్తిమీర.. ఏడిపిస్తున్న కట్ట ధర!

22 Sep, 2022 11:32 IST|Sakshi

రైతులకు కాసుల పంట

వినియోగదారుల జేబులకు చిల్లులు

హోసూరు(బెంగళూరు): కొత్తిమీర ధరలు ఆకాశాన్నంటాయి. రూ.10 నుంచి రూ.20 మధ్య ఉన్న కొత్తిమీర కట్ట ధర ఏకంగా రూ.80కి చేరింది. పెరిగిన ధరలు రైతుల్లో ఆనందాన్ని నింపుతుండగా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. హోసూరు, డెంకణీకోట, సూళగిరి, అంచెట్టి తాలూకాల్లో సుమారు 3వేలకుపైగా ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంట సాగు చేశారు.

45 రోజుల్లో పంట చేతికందుతుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొలాల్లో వరదనీరు చేరడంతో కొత్తిమీర పంట దెబ్బతింది. దీంతో మార్కెట్‌కు సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు అమాంతంగా పెరిగాయి. బెంగళూరు, ముంబై, చెన్నై నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులు పొలాల వద్దకు వెళ్లి పంటను కొనుగోలు చేస్తున్నారు.  10 రోజుల క్రితం హోసూరు రైతు బజారులో రూ.30 వరకు ధరపలికిన కొత్తిమీర బుధవారం అకస్మాత్తుగా రూ.80 వరకు చేరింది. ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు రైతులు చెబుతున్నారు.

చదవండి: పాఠశాల గదిలో 140 మద్యం కాటన్లు.. షాకైన ఉపాధ్యాయులు! 

మరిన్ని వార్తలు