తదుపరి సీజేఐగా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌.. హిస్టరీ బ్రేక్‌ చేసిన ట్రాక్‌ రికార్డ్ 

5 Aug, 2022 03:31 IST|Sakshi

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఎన్నో కీలక కేసుల్లో తీర్పులిచ్చి చరిత్ర సృష్టించారు. ముస్లిం మహిళలకు నోటి మాట ద్వారా విడాకులిచ్చే త్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దానిని రద్దు చేస్తూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్‌ యుయు లలిత్‌ కూడా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ నేరుగా సుప్రీం బెంచ్‌కు వచ్చి అత్యున్నత స్థానాన్ని అందుకున్న రెండో వ్యక్తిగా జస్టిస్‌ లలిత్‌ రికార్డులకెక్కనున్నారు.

1971 జనవరిలో 13వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రి బార్‌ నుంచి బెంచ్‌కు వచ్చిన తొలి వ్యక్తి. ఆగస్టు 27న జస్టిస్‌ లలిత్‌ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్‌ 8న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన కేవలం 74 రోజులు మాత్రమే సీజేఐ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలం ఎవరూ ఈ పదవిలో కొనసాగలేదు.  

కాగా, జస్టిస్‌ యు యు లలిత్‌ మహారాష్ట్రలో 1957 నవంబర్‌ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా లలిత్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. 1986లో ముంబైæ నుంచి ఢిల్లీకి వచ్చారు. 2004, ఏప్రిల్‌ 29న సుప్రీం కోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ అయ్యారు. క్రిమినల్‌ లాయర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినీ తారల వరకు ఎందరో ఆయన క్లయింట్లుగా ఉన్నారు.  బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిందితుడిగా ఉన్న హై ప్రొఫైల్‌ కేసులు సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్, తులసీరామ్‌ ప్రజాపతి కేసుల్ని వాదించారు.

కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తరఫున కోర్టులో వాదించారు. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ అవినీతి కేసుల్ని, ఒకప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వికె సింగ్‌ పుట్టిన తేదీ వివాదం కేసుల్ని వాదించారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేసుల్లో సీబీఐ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. లలిత్‌ది న్యాయవాదుల కుటుంబం. ఆయన తండ్రి యుఆర్‌ లలిత్‌ బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా ఉండేవారు. 

కీలక తీర్పులు  
బార్‌ నుంచి సుప్రీం కోర్టు బెంచ్‌కి నేరుగా వచ్చిన అతి కొద్ది మంది న్యాయవాదుల్లో లలిత్‌ ఒకరు. 2014 జూలైలో సుప్రీం కొలీజియం లలిత్‌ను న్యాయమూర్తిగా తీసుకోవాలని సిఫారసు చేసింది. 2017 ఆగస్టులో త్రిపుల్‌ తలాక్‌పై ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. అయిదుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ ఒకరు. ఈ తీర్పు 3–2 మెజార్టీతో వెలువడింది. త్రిపుల్‌ తలాక్‌ చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమంటూ జస్టిస్‌ యుయు లలిత్‌ గట్టిగా చెప్పారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జెఎస్‌ ఖేకర్, న్యాయమూర్తులు, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్లా నజీర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు.

ఆనాటి సీజేఐ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రమే చట్టం చేయాలంటూ తీర్పునివ్వకుండా ఆరు నెలలు నిలిపివేశారు. కానీ మిగిలిన ముగ్గురు త్రిపుల్‌ తలాక్‌ రద్దుకు అనుకూలంగా ఉండడంతో ఆ తీర్పు వెలువడింది. 2020 జులైలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబం హక్కేనంటూ తీర్పునిచ్చిన బెంచ్‌లో జస్టిస్‌ లలిత్‌ ఉన్నారు. పోక్సో చట్టం కింద వివాదాస్పద స్కిన్‌ టు స్కిన్‌ నేరుగా శారీరక భాగాలు తాకితేనే లైంగిక నేరం కిందకి వస్తుందంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో జస్టిస్‌ లలిత్‌ తోసిపుచ్చారు.    

ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

మరిన్ని వార్తలు