అగ్నివేశ్‌కు ప్రముఖుల నివాళి

13 Sep, 2020 05:07 IST|Sakshi
గురుగ్రామ్‌లో అగ్నివేశ్‌ అంతిమయాత్ర

న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత స్వామి అగ్నివేశ్‌ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. వెట్టి కార్మికులు, స్త్రీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిజమైన సెక్యులర్‌ నేతగా ఆయనను కొనియాడారు. అగ్నివేశ్‌ భౌతికకాయానికి శనివారం ఆర్యసమాజ్‌ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. సమాజంలో అల్పసంఖ్యాకుల తరఫున ఆయన జీవితాంతం పోరాడారని, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల పక్షాన ఆయన తన గొంతు వినిపించారని కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ నివాళులు అర్పించారు. దేశంలో మతసామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి మరువలేనిదని మాజీ ప్రధాని మన్మోహన్‌ కొనియాడారు. వామపక్ష పోరాటాలకు ఆయన గొప్ప స్నేహితుడని, పైకి కాషాయం ధరించినా లోపల నిజమైన సెక్యులర్‌ అని సీపీఐ లీడర్‌ డి రాజా ప్రశంసించారు. డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే నేత రామ్‌దాస్‌ సైతం అగ్నివేశ్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన సిద్ధాంతాలతో విభేదించేవారు ఆయనపై అనేకమార్లు దాడులకు దిగినా, నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డారని లాయర్‌ మహమూద్‌ ప్రాచా ప్రశంసించారు.   
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు