కోవిడ్‌-19 పై విజయం సాధిస్తాం: గడ్కరీ

1 Dec, 2020 07:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యక్తం చేశారు. ఆర్థిక యుద్ధంలో విజయం సాధించే దిశలో కరోనా మహమ్మారిని జయిస్తామన్న భరోసానిచ్చారు. లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్కరీ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ నిర్వహించిన ఒక వెర్చువల్‌ సమావేశంలో చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... (చదవండి: కరోనా : మోడర్నా మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది)

  • ఇప్పుడు మెజారీటీ దేశాలు చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగించాలని కోరుకోవడంలేదు. ఆయా దేశాలు ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి భారత్‌కు ప్రత్యేకించి తయారీ రంగానికి సానుకూలాంశం. భారత్‌ ఎగుమతుల అభివృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 
  • ఒకపక్క చైనా నుంచి భారత్‌ దిగుమతులను తగ్గించుకుంది. అదే సమయంలో మన దేశ ఎగుమతులూ పెరిగాయి. ఎగుమతులు-దిగుమతుల విభాగంలో సానుకూల ధోరణులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈ రంగం మహ్మమ్మారి సవాళ్లును అధిగమిస్తోంది.
  • ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, పర్యావరణం, పునరుత్పాదకత, స్మార్ట్‌ విలేజెస్‌ అభివృద్ధి, ఈ-మొబిలిటీవంటి అంశాల్లో భారత్‌ పురోగమిస్తోంది. ఆయా రంగాల్లో ఎంఎస్‌ఎంఈలు కూడా పనిచేసే వీలుంది.
  • ఐఐటీ, ఎన్‌ఐఐటీ వంటి విద్యా, పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో పెద్ద సంఖ్యలో ఎక్స్‌లెన్స్‌ సెంటర్లను ఏర్పాటుపై ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోంది.
  • ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ప్రస్తుత వార్షిక టర్నోవర్‌ విలువ రూ.80,000 కోట్లు. వచ్చే రెండేళ్లలో ఈ విలువను రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

 
ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి...

కాగా, హొరాసిస్‌ ఆసియా సదస్సు 2020ను ఉద్ధేశించి చేసిన ఒక ప్రసంగంలో గడ్కరీ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రజల్లో సానుకూలత, విశ్వాసం నింపడం ముఖ్యమన్నారు. ప్రతికూలత, అనుమానాస్పద వాతావరణం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారుతుందని పేర్కొన్నారు. గణాంకాల ప్రాతిపదకన చూస్తే, ‘‘మనం త్వరలో సాధారణ పరిస్థితికి చేరుతున్న విషయం అర్థం అవుతుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు