కొబ్బరికాయ కొట్టాలన్న కేంద్ర మంత్రి.. నెటిజన్ల ఫైర్‌

27 Apr, 2021 13:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మద్దతుగా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ సమయంలో కరోనా నివారణ, అవగాహన కోసం కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే ‘గో కరోనా గో కరోనా’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఆ స్లోగన్‌ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది.  తాజాగా బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఒకింత విచిత్రమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కరోనాతో కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధితులకు ధైర్య చెప్పే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

లార్డ్ బాలాజీకి కొబ్బరి కాయ కొట్టండి అంతా ఆయనే చూసుకుంటారని షెకావత్‌ చెప్పడం పట్ల నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌లో విజృంభిస్తోందని విమర్శిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతుంటే ఉచిత సలహాలు ఏంటని చురకలు వేస్తున్నారు.

ఇంతకూ విషమేంటంటే.. రాజస్తాన్‌ జోధ్‌పూర్‌లో కేంద్రమంత్రి షెకావత్‌ సోమవారం పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధురాదాస్ మాథుర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన్ను ఓ యువకుడు కలుసుకుని తన తల్లిని కాపాడాలని ప్రాధేయపడ్డాడు. యువకుని విజ్ఞప్తి మేరకు షెకావత్‌ డాక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కేంద్రమంత్రి ఆదేశాలతో బాధితురాలికి చికిత్స చేసేందుకు డాక‍్టర్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ బాధితురాలు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. మృతురాలి కుమారుడు గుండెలవిసేలా రోదించాడు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకున్న తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని కొడుకు  రోధించిన తీరు చూపురులను కంటతడి పెట్టించింది. 

అయితే, మృతురాలి బంధువులను ఓదార్చే క్రమంలో షెకావత్‌.. ‘బాలాజీ మహరాజ్‌ మంత్రాన్ని జపించి కొబ్బరికాయ కొట్టండి. అంతా ఆయనే చూసుకుంటారు’ అని షెకావత్‌ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ బారినపడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండా దేవుడిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షెకావత్ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేవుడిపై నమ్మకంతో కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అందులో తప్పేముంది. ఆందోళనలో మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలనుకున్నాను. నేను అదే చేశాను’ అని ఆయన పేర్కొన్నారు.
చదవండి: కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్‌ కేసులు

మరిన్ని వార్తలు