రాహుల్‌, ప్రియాంకలకు కేంద్ర మంత్రి సవాల్‌

12 Oct, 2020 10:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల ఆందోళనను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తప్పుపట్టారు. రైతాంగాన్ని వారు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆకులను చూసి పంట ఏదో వారు చెప్పగలిగితే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ఆయన సవాల్‌ విసిరారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలు, రైతుల ఆందోళనల నేపథ్యంలో రాహుల్‌, ప్రియాంక గాంధీలపై షెకావత్‌ విరుచుకుపడ్డారు. విపక్షాల వ్యతిరేకత మధ్య వ్యవసాయ బిల్లులను పార్లమెంట్‌ ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు కాంగ్రెస్‌ సారథ్యం వహిస్తోంది.

రాహుల్‌కు ఉల్లిగడ్డలు ఎలా పెరుగుతాయో తెలియదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎద్దేవా చేశారు. ఉల్లిగడ్డలు భూమిలోపల పెరుగుతాయా వెలుపల పెరుగుతాయా అనేది ఆయనకు తెలియదని వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని, ఇవి కార్పొరేట్లకు మేలు చేస్తాయని మద్దతు ధర వ్యవస్ధ కనుమరుగవుతుందని విపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చేస్తాయని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయే నుంచి వైదొలగింది. పంజాబ్‌, హరియాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనల బాటపట్టారు. చదవండి : మోదీకి చెప్పలేకపోవడమే అసలు సమస్య

మరిన్ని వార్తలు