నేషనల్‌ వార్‌ మెమోరియల్‌పై అమరవీరుల పేర్లు

30 Jul, 2020 18:14 IST|Sakshi

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. జవాన్ల త్యాగాన్ని దేశం వేనోళ్ల కొనియాడింది. తాజాగా ఈ అమరవీరులకు మరింత గౌరవం ఇవ్వడం కోసం కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసవులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘నేషనల్ వార్ మెమోరియల్‌’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం)

జూన్ 15న లద్దాఖ్ గల్వాన్‌ వ్యాలీలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 చుట్టూ చైనా ఒక నిఘా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ దాడిలో చైనా సైనికులు.. రాళ్లు, మొలలు దిగిన కర్రలు, ఇనుప రాడ్లతో మన సైనికులపై దాడి చేశారు. నాటి ఘటనలో 16 బిహార్‌ రెజిమెంట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ బీ సంతోష్‌ బాబుతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చైనా వారికి ప్రభుత్వ లంఛనాలతో అంత్యక్రియలు కాదు కదా కనీసం అమరులైనా సైనికుల పేర్లు​ కూడా వెల్లడించలేదు. కానీ భారత్‌ మాత్రం మన సైనికుల త్యాగాన్ని గర్వంగా వెల్లడించింది. 

మరిన్ని వార్తలు