గాంధీలు వారే, గాడ్సేలు వారే....!

26 Aug, 2020 13:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శతాధిక వత్సరాల జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన జరగబోతుందన్న సంకేతాలు వెలువడడంతో 24వ తేదీన జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బ్రహ్మాండం బద్దలయ్యేలా ఏదో జరగబోతోందని ఆశావహులందరు ఆశించారు. పార్టీలో సమూల మార్పులు కోరుతూ పార్టీ అధిష్టానానికి 23 మంది పార్టీ సీనియర్‌ నేతలు రాసిన లేశ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాదరణ కోల్పోతోందని, కార్యకర్తల్లో నైరాశ్యం ఆవహించిందని సీనియర్‌ నేతలు ఆ లేఖలో ఆరోపించారు. పార్టీకి పూర్వ జవసత్వాలు తీసుకరావాలంటే పార్టీకి సమర్థ నాయకత్వం అవసరం అని, అందుకు పార్టీలో అధికార వికేంద్రీకరణ జరగాలని, అంతర్గత ప్రజాస్వామ్యం బలపడాలని, పార్టీ పదవులన్నింటికి ఎన్నికలు జరగాలని వారు భాషించారు. అందుకు అనుగుణంగా ప్రియాంక గాంధీ స్పందించారు. ( ‘మనసు నొప్పించి ఉంటే క్షమించండి’)

పార్టీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబేతరులు ఉండాలని మరోసారి నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం కాగానే అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. సోనియా గాంధీతోపాటు తాము కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని గులాం నబీ ఆజాద్‌ లాంటి సీనియర్‌ నాయకులు ప్రకటించారు. సీనియర్‌ నాయకులు రాసిన పార్టీ అంతర్గత లేఖపై అంతర్‌మథనం జరుగుతుందని, గాంధీల నాయకత్వంపై నిర్మాణాత్మక దాడి కొనసాగుతుందని రాజకీయ వర్గాలతోపాటు సామాన్య ప్రజలు కూడా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా సమావేశం కాస్తా గాంధీల దర్బార్‌గా మారిపోయింది. అసమ్మతి గళాలు హఠాత్తుగా మూగబోయాయి. రాజీనామాలకు సైతం రొమ్ము విరిచిన పార్టీ సీనియర్‌ నాయకులు సొమ్మసిల్లినట్లు సద్దుమణిగారు. సోనియా గాంధీ రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండానే కుర్చీకి అతుక్కుపోయారు. మరో ఆరు నెలల్లో పార్టీ అధ్యక్షులను ఎన్నుకుంటామన్న హామీతో దర్బార్‌ దర్జాగా ముగిసిపోయింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపజయం పాలైనప్పటి నుంచి నాయకత్వ మార్పు మాట వినిపిస్తోంది.

‘ప్లీజ్‌ ప్లీజ్‌...పార్టీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను. ఒప్పుకోండి! ప్లీజ్‌’ అంటూ రాహుల్‌ గాంధీ ముందుకు వచ్చారు. గాంధీ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ గాంధీలే మాట్లాడారు. చేతులు కట్టుకుని ముందు నిలబడే గాంధీ విధేయులంతా ఒకసారి తర్జనభర్జన పడ్డారు. పార్టీ పగ్గాల విషయంలో పొత్తు కుదరక మరోసారి చేతులు కట్టుకున్నారు. గాంధీ నాయకత్వం తలచుకుంటే పీవీ నర్సింహారావు, సీతారామ్‌ కేసరి తరహాలో పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పగించవచ్చు. అలా చేయకుండా పార్టీ నాయకత్వ మార్పుపై చర్చాగోష్టిలు పెట్టడం విధేయత ప్రకటించుకొని పదవులను కాపాడుకోవడం గాంధీలకు పరిపాటిగా మారినట్లు ఉంది. పార్టీ పగ్గాలు ఇతరులు చేపట్టాలంటూ గాంధీలుగా పిలుపునిస్తూ గాడ్సేలుగా ఆ ప్రయత్నాలను వారే అడ్డుకుంటున్నట్లు అర్థమవుతోంది. 

మరిన్ని వార్తలు