ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోన్న పోస్టర్లు

5 Nov, 2020 11:02 IST|Sakshi

లక్నో: హోటల్‌కి వెళ్లినప్పుడు మనం మెను కార్డులు చూస్తూ ఉంటాం. ఒక్కో ఆహారానికి ఒకే రేటు. అలానే ప్రయాణాల సమయంలో, హోటల్స్‌, సినిమా థియేటర్లు ఇలా పలు చోట్ల మనం వేర్వేరు సర్వీసులకు ఎంత డబ్బు తీసుకుంటారో తెలిపే డిస్‌ప్లే బోర్డులను చూస్తూ ఉంటాం. కానీ వేర్వేరు నేరాలకు వివిధ రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. లేదంటే ఓ సారి ఉత్తరప్రదేశ్‌ ముజఫర్ నగర్ వెళ్లండి. అక్కడ మీకు ఓ గ్యాంగ్‌ కనిపిస్తుంది. కిడ్నాప్‌, బెదిరించడం, హత్య చేయడం, కొట్టడం వంటి పనులు చేసి పెడతారు. కాకపోతే వారు డిసైడ్‌ చేసినంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఏ క్రైమ్‌కి ఎంత చార్జ్‌ చేస్తారో వివరిస్తూ ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు.(చదవండి: 'ఆంటీ' అన్నందుకు జుట్టు ప‌ట్టుకుని కొట్టింది)

దాని మీద ధమ్కి(బెదిరించడానికి)కి 1000 రూపాయలు, కొట్టడానికి 5,000 రూపాయలు, ఎవరినైనా గాయపర్చడానికి 10,000 రూపాయలు.. హత్యకు 55,000 రూపాయలు మాత్రమే అంటూ ఈ గ్రూపు పోస్టర్‌ విడుదల చేసింది. దాని మీద ఓ యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఉండగా.. పక్కనే మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. ఇక ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రకటన ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరంతా చరతవాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చౌకడ గ్రామానికి చెందిన వారని తెలిసింది. వీరిలో ఓ యువకుడు పీఆర్‌డీ జవాన్‌ కుమారుడిగా తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కేసు నమోదు చేశాం. సదరు యువకులను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు