ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?

27 May, 2021 18:42 IST|Sakshi

లక్నో: భారతీయులకు వేదకాలం నుంచి గంగానదితో అనుబంధం పెనువేసుకుపోయింది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం.. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అతంటి పరమ పావనమైన గంగానది గత కొన్నేళ్లుగా మురికికూపంగా తయారవుతోంది. 

గత ఏడాది కోవిడ్-19 వల్ల ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాలుష్యం తగ్గడంతో గంగా నది తనను తాను శుభ్రం చేసుకుంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్ సమయంలో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. గంగా పరివాహక ప్రాంతంలోని అనేక నదీ తీరాలు ఆకుపచ్చగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీరు విషపూరితంగా మారి, ఆకుపచ్చ రంగులోకి మారుతుందని.. దీనికి గల కారణాన్ని పరిశోధించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.

"చెరువులు, సరస్సుల నుంచి నాచు అధికంగా రావడం వల్ల వర్షాకాలంలో గంగానది లేత ఆకుపచ్చగా మారుతుంది. అయితే, ఈసారి ఆ రంగు అధికంగా ఉంది. ఇంతకుముందు ఆకుపచ్చగా మారడం కొన్ని ఘాట్లలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ప్రతిచోటా ఈ విధంగా నీరు రంగు మారి కనిపిస్తోంది. అంతేకాకుండా దీని నుంచి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు" అని వారణాసికి చెందిన లావ్కుష్ సాహ్ని అన్నారు.

దీనిపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మాల్వియా గంగా పరిశోధనా కేంద్రం ఛైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ.. మైక్రోసిస్టిస్ ఆల్గే (నాచు) వల్ల నది పచ్చగా కనిపించవచ్చు అన్నారు. మైక్రోసిస్టిస్ ప్రవహించే నీటిలో కనిపించదు. కానీ ఎక్కడ నీరు ఆగి పోషకాలకు వృద్ధి జరిగితే మైక్రోసిస్టిస్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది చెరువుల నీటిలో మాత్రమే పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సాధారణంగా మార్చి, మే నెలల మధ్య జరుగుతుంది. కానీ ఈ విధంగా రంగు మారడం వల్ల నీరు విషపూరితంగా మారుతుంది. దీంతో ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయని, ఈ నీటిని తాగితే కాలేయానికి హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

(చదవండి: రూ. 20లక్షల బిల్లు: మిగతా సొమ్ము కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లండి!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు