అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్‌!

9 May, 2023 11:43 IST|Sakshi

లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్‌ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్‌(అశ్రఫ్‌) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు.  ఈ ఇద్దరి డెత్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు.

152 కేసుల్లో అతీక్‌పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్‌కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. 

అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్‌పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. 

కాగా.. అతీక్‌, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు.
చదవండి:  బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు

మరిన్ని వార్తలు