ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ లాయర్‌ అరెస్టు..

30 Jul, 2023 15:17 IST|Sakshi

లక్నో: ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ లాయర్ విజయ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ శాసన సభ్యుడు రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఉమేశ్‌ను అతీక్ అహ్మద్ కుమారుడు మరికొందరితో కలిసి హత్య చేశారు. ఈ వ్యవహారంలో ఉమేశ్ పాల్ లొకేషన్‌ను లాయర్ విజయ్ షేర్ చేసినట్లు గుర్తించారు. శనివారం రాత్రి లక్నోలోని తాజ్ హోటల్‌ బయట అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఉమేశ్ హత్య సంబంధిత వీడియోలు ఉత్తరప్రదేశ్‌లో గతంలో వైరల్ అయ్యాయి. దుండగులు ఉమేశ్‌ ఇంటి వద్దే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో యూపీ అసెంబ్లీలో దుమారం రేగింది. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో మాఫియాను అంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తదనంతర కాలంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌, అతని కుమారుడు ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురయ్యారు. 

ఉమేశ్ హత్య కేసులో అతీక్ భార్య పర్వీన్ కూడా నిందితురాలుగా ఉన్నారు. 2019లో తాను జైలులో ఉన్నప‍్పుడే హత్యకు కుట్ర పన్నినట్లు అతీక్ గతంలో వాంగ్మూలాన్ని ఇచ్చాడు. జైలులో ఉన్నప్పుడే పర్వీన్ సందర్శించి ఫోన్‌ను ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ ఫోన్‌తోనే ఉమేశ్ హత్యకు కుట్ర జరిగిందని వెల్లడించాడు. ప్రస్తుతం పర‍్వీన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

ఇదీ చదవండి: కేరళలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య..

మరిన్ని వార్తలు