కోవిడ్‌ కట్టడిలో భారత్‌ భేష్‌.. ఆక్సిజన్‌ కొరతతో కోవిడ్‌ మరణాలపై లెక్కేది?

14 Sep, 2022 12:44 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడిలో విఫలమై ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే కోవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్‌ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్‌ ఈ విషయంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సీఈఓ మార్క్‌ సుజ్‌మాన్‌ వ్యాఖ్యానించారు.

ఫౌండేషన్‌ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్‌కీపర్స్‌) నివేదిక విడుదల సందర్భంగా మంగళవారం ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్‌ మహమ్మారి అదుపులో భారత్‌ విజయం సాధించింది. కోవిడ్‌ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం. 200 కోట్ల కరోనా టీకాల పంపిణీ, ఏకంగా 90 శాతం వ్యాక్సినేషన్‌ రేటుతో ఎన్నో విషయాల్లో దిక్సూచీగా మారింది..

దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయించి వ్యాక్సిన్‌ తయారీ రంగంలో పెద్దన్న పాత్ర కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జీ20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ సత్తా చాటుతోంది. పేదరిక నిర్మూలన, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల వంటి అంశాల్లోనూ మంచి పురోగతి సాధించింది. కోవిన్‌ యాప్‌ ద్వారా త్వరితగతిన కోట్లాది వ్యాక్సిన్ల పంపిణీని సుసాధ్యంచేసింది. భారత్‌లో స్వయం ఉపాధి బృందాల ద్వారా మహిళలు సాధించిన సాధికారత, ప్రగతి అమోఘం’ అని సుజ్‌మాన్‌ అన్నారు.  

ఆక్సిజన్‌ కొరతతో కోవిడ్‌ మరణాలపై ఆడిట్‌

కరోనా రెండో వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్‌ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్‌ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమర్పించింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది. 

ఇదీ చదవండి: రేపిస్ట్‌ ఇల్లు నేలమట్టం!

మరిన్ని వార్తలు