పవార్‌ ఇంటికి అదానీ.. రెండు గంటల పాటు భేటీ

20 Apr, 2023 15:33 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఇవాళ(గురువారం) ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ(Gautam Adani), యూపీఏ మిత్రపక్షం అయిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP) అధ్యక్షులు శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. సౌత్‌ ముంబైలోని పవార్‌ సిల్వర్‌ ఓక్‌ ఇంటికి వెళ్లిన అదానీ.. రెండు గంటలపాటు అక్కడే గడిపారు. దీంతో ఈ భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. 

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ పరిశోధన నివేదిక ఆధారంగా అదానీపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలన్నీ ఏకం కాగా, పవార్‌ మాత్రం జేపీసీని విభేదించారు. అంతేకాదు.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారయన. ఈలోపు పవార్‌ తీరుపై విపక్షాల్లో అసహనం పెరిగిపోవడంతో జేపీసీకి బదులు.. సుప్రీం కోర్టు కమిటీని సమర్థిస్తూ తన అభిప్రాయం వెలిబుచ్చారాయన. జేపీసీలో మెజార్టీ సభ్యులు బీజేపీవాళ్లే ఉంటారని, కాబట్టి సుప్రీం ఆధారిత కమిటీనే ఈ వ్యవహారంలో విచారణకు మేలని విపక్షాలకు  గుర్తు చేశారాయన. 

అయితే అంతలో మరోసారి స్వరం మార్చిన ఆయన.. విపక్షాల జేపీసీ విచారణ డిమాండ్‌కు తాము(ఎన్సీపీ) గళం కలపబోమని, అలాగని ఆ డిమాండ్‌ను వ్యతిరేకరించబోమని ప్రకటించారు. విపక్షాల ఐక్యత నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 

అయితే.. అదానీ విషయంలో పవార్‌ మొదటి నుంచి మెతక వైఖరి ప్రదర్శిస్తుండడంపై పలు విమర్శలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల కిందట వీళ్లద్దరికీ మంచి స్నేహం ఉండేది. కోల్‌ సెక్టార్‌ విస్తరణలో ఈ వ్యాపారవేత్తకు, రాజకీయనేత అయిన పవార్‌కు మధ్య బంధం ఏర్పడింది. అంతేకాదు.. పవార్‌ తన ఆటోబయోగ్రఫీ లోక్‌ మజే సాంగతి(2015)లో.. అదానీ హార్డ్‌వర్కర్‌ అని, సాదాసీదాగా, డౌన్‌ టు ఎర్త్‌ ఉంటారని పవార్‌ పేర్కొనడం గమనార్హం.  


ఇదీ చదవండి: పారిపోయే యత్నం.. అమృత్‌పాల్‌ భార్య అరెస్ట్‌!

మరిన్ని వార్తలు