అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం!.. అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటన

23 Sep, 2022 10:45 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. ఎన్నికకు సోనియా గాంధీ కుటుంబం దూరంగా ఉండడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో గెహ్లాట్‌ అధికారికంగా నిలిచిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఉన్నారు. గురువారం సాయంత్రం అశోక్‌ గెహ్లాట్‌, రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. పార్టీ అధ్యక్ష పదవికి తమ కుటుంబం దూరంగా ఉంటుందని స్వయంగా రాహుల్‌ వెల్లడించినట్లు గెహ్లాట్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలని వస్తున్న విజ్ఞప్తులను అంగీకరించాలని అతన్ని(రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ..) కోరాం. కానీ, తాను కాదు కదా తన కుటుంబం నుంచి కూడా ఎవరూ అధ్యక్ష బరిలో ఉండబోరని ఆయన స్పష్టం చేశారు అని గెహ్లాట్‌ శుక్రవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. 

వాళ్ల కోరికను గౌరవిస్తాను. కానీ, నేను ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నా. అంతేకాదు.. గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపడతారు అంటూ రాహుల్‌ బదులిచ్చినట్లు గెహ్లాట్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. రేసులో ఇప్పటికే అశోక్‌ గెహ్లాట్‌తో పాటు దిగ్విజయ్‌ సింగ్‌, శశిథరూర్‌తో పాటు మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: అలా అంటే కుదరదు గెహ్లాట్‌జీ-రాహుల్‌

మరిన్ని వార్తలు