చైనాకు తగిన రీతిలో బదులిస్తాం: రావత్‌ 

4 Sep, 2020 10:17 IST|Sakshi
చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్(ఫైల్‌ ఫొటో)

పాకిస్తాన్‌కు చైనా అన్ని రకాలుగా సాయం అందిస్తోంది

పాక్‌ దుస్సాహసానికి దిగితే నష్టపోతుంది

చైనాకు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధం

న్యూఢిల్లీ: సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. డ్రాగన్‌ దేశం ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగినా అందుకు సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉందని చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లోని కొన్నిప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా తెగబడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా గురువారం నాటి అమెరికా- భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ఆన్‌లైన్‌ చర్చా కార్యక్రమంలో రావత్‌ మాట్లాడారు. (చదవండి: రెచ్చగొడితే తిప్పికొడతాం)

భారత్‌ అణు యుద్ధం నుంచి సంప్రదాయ యుద్ధాల వరకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. టిబెట్‌లోని తమ స్థావరాల్లో, వ్యూహాత్మక రైల్వే లైన్ల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో చైనా చేస్తున్న కార్యకలాపాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని రావత్‌ అన్నారు. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాకిస్తాన్‌ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాక్‌ జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను ఎలా ఎగదోస్తోందో ఆయన సవివరంగా చెప్పారు. (చదవండి: ఆయుధ సంపత్తిని పెంచుకునే పనిలో చైనా! )

‘‘ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చైనా ఆర్థిక సహాయం అందిస్తోంది. అంతేగాక పాకిస్తాన్‌కు సైనిక, దౌత్యపరంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగుతోంది. అయితే వీటన్నింటిని సమర్థవంతంగా తిప్పి కొట్టగల సత్తా భారత్‌కు ఉంది. ఇక చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో పాకిస్తాన్‌.. ఉత్తర సరిహద్దుల్లో మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే నిజంగానే పాకిస్తాన్‌ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది’’ అని రావత్‌ హెచ్చరికలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు