Geological Survey of India:జమ్మూకశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం

11 Feb, 2023 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ:  బ్యాటరీలు, విద్యుత్‌ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను తొలిసారిగా మన దేశంలో గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. ‘‘జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్‌ హైమనా ప్రాంతంలో లిథియం నిల్వలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించింది’’ అని ట్వీట్‌ చేసింది. గనుల శాఖ 2018–19లో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 51 ఖనిజ క్షేత్రాలను కనిపెట్టింది. సంబంధిత సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసింది. బంగారంతో పాటు పొటాషియం, మాలిబ్డినం, ఇంకా ఇతర ప్రాథమిక లోహాల నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు.

బంగారం నిల్వలను 5 క్షేత్రాలను కనుగొన్నారు. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనుల శాఖ తెలిపింది. భారత్‌ ప్రస్తుతం లిథియంను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. విద్యుత్‌ వాహనాల తయారీలో లిథియం చాలా కీలకం. ఇప్పుడు ఈ ఖనిజ నిల్వలు జమ్మూకశ్మీర్‌లో బయటపడడంతో రాబోయే రోజుల్లో దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ రంగం వేగం పుంజుకోనుంది. లిథియం దిగుమతుల భారం పెద్దగా ఉండదు కాబట్టి విద్యుత్‌ వాహనాల ధరలు దిగివచ్చే అవకాశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీలోనూ లిథియం ఉపయోగిస్తారు.

మరిన్ని వార్తలు