ఘజియాబాద్‌ వీడియో: ట్విటర్‌ ఎండీకి లీగల్‌ నోటీసులు.. వారం గడువు

18 Jun, 2021 09:39 IST|Sakshi

న్యూఢిల్లీ: యూపీ ఘజియాబాద్‌లో వృద్ధుడిపై దాడి ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ వృద్ధుడి ఫిర్యాదుపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ట్విటర్‌ ఇండియా ఎండీకి నోటీసులు జారీచేశారు. 

ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ట్విటర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ మహేశ్వరికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా లోని పోలీస్‌ స్టేషన్‌కొచ్చి.. వివరణ ఇచ్చుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్‌ చేసిందంటూ ట్విటర్‌పై అభియోగాల్ని యూపీ పోలీసులు నమోదుచేశారు. ‘‘ట్విటర్‌ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్‌ చేశారు. కానీ, ట్విటర్‌ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్‌ ఎండీని ప్రశ్నించారు. 

కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు, కాంగ్రెస్‌ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయగా, నటి స్వరభాస్కర్‌పై కూడా ఫిర్యాదు అందింది. మరోవైపు తాయెత్తులు అమ్మే సూఫీ అబ్దుల్‌ సమద్‌పై ఆ వ్యవహారంలోనే కక్షకట్టి దాడి చేశారని, ఇందులో మత కోణం లేదని  పోలీసులు చెప్తుండగా.. మరోవైపు సమద్‌ కుటుంబం మాత్రం అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడేనని చెబుతోంది.

టైం కావాలి
ఇక కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌ ముందు ఇవాళ ట్విట్టర్‌ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా.. ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్‌ ఉన్నతాధికారులను కమిటీ ఇదివరకే ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ, ట్విటర్‌ అధికారుల అభిప్రాయాల్ని తీసుకుంది. కొవిడ్‌  కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు కొంచెం సమయం కావాలని ట్విటర్‌ కోరినట్లు తెలుస్తోంది.

చదవండి: ఏం రాహుల్‌.. విషం నింపుతున్నావా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు