స్వరా భాస్కర్‌, ట్విటర్‌ ఇండియా హెడ్‌పై ఫిర్యాదు.. కారణం?

17 Jun, 2021 14:36 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌తోపాటు ట్విటర్‌ ఇండియా హెడ్‌ మనీష్‌ మహేశ్వరిపై ఢిల్లీలో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన వీడియోపై అనుచిత ట్వీట్లు చేసినందుకు వీరిద్దరిపై ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనప్పటికీ ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఘజియాబాద్‌లో సూఫీ అబ్దుల్ సమద్ అనే వృద్ధుడిపై కొంతమంది దాడి చేసి తన గడ్డం కత్తిరించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అతనితో వందే మాతరం, జై శ్రీ రామ్ అనాలని బలవంతం చేశారని ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేతలు, జర్నలిస్టులు  తమ ట్విటర్‌లలో షేర్‌ చేశారు.

ఈ క్రమంలోనే నటి స్వరా భాస్కర్‌, పాత్రికేయురాలు ఆర్ఫా కన్నుమ్‌ శర్వాణి, ఆసిఫ్‌ ఖాన్ దాడి వీడియోను తమ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో  ఓ న్యాయవాది తన ఫిర్యాదుతో బుధవారం ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. మత పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వీడియోను వీరంతా షేర్‌ చేసి... శాంతికి విఘాతం కల్పించడంతో పాటు పౌరుల మధ్య మత కల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 

అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు స్పందిస్తూ ఇందులో మతతత్వానికి సంబంధించిన విషయం ఏం లేదని స్పష్టం చేశారు. అదృష్టం పేరుతో మోసగించినందుకు అతనిపై కోపంతో హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు దాడి చేశారని పేర్కొన్నారు.ఇక  ఇదే వీడియోపై ట్విట్టర్‌, ట్విట్టర్‌ కమ్యూనికేషన్‌ ఇండియా, ద వైర్‌ జర్నలిస్టులు మహ్మద్‌ జుబైర్‌, రానా అయూబ్‌, కాంగ్రెస్‌ నేతలు శర్మ మహ్మద్‌, సల్మాన్‌ నిజామీ, మస్కూర్‌ ఉస్మానీ, రచయిత సభా నఖ్వీలపై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు