మోదీపై ఆజాద్‌ ప్రశంసలు

1 Mar, 2021 02:30 IST|Sakshi

జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ తన గతం గురించి మొహమాటం లేకుండా నిజాలు చెప్పారని పేర్కొన్నారు. చిన్న గ్రామం నుంచి వచ్చానని, రైల్వే స్టేషన్‌లో టీ అమ్మానని మోదీ గతంలో పలుమార్లు చెప్పిన విషయాన్ని ఆజాద్‌ గుర్తు చేశారు. ఎవరైనా సరే.. తన మూలాల విషయంలో గర్వపడాలన్నారు. జమ్మూలో గుజ్జర్‌ దేశ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆజాద్‌ పాల్గొన్నారు. ‘కొందరు నాయకులను నేను అభిమానిస్తాను. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఆ విషయం నాకు గర్వకారణం. అలాగే, దేశంలోనే పెద్ద నాయకుడైన ప్రధాని మోదీ కూడా  చిన్న గ్రామం నుంచి వచ్చానని, రైల్వే స్టేషన్‌లో టీ అమ్మానని చెప్పుకున్నారు.

అది వారి గొప్పతనం’ అని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎంపీగా ఆజాద్‌ పదవీవిరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని మోదీ, ఆజాద్‌ పరస్పరం ప్రశంసలతో ముంచెత్తుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్‌ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో ఆజాద్‌ కీలక నేత. జీ 23 నాయకులు శనివారం జమ్మూలో సమావేశమై, కాంగ్రెస్‌ భవితవ్యంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై స్పందిస్తూ.. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) నుంచి ఆయన హోదాను తొలగించి సామాన్య కానిస్టేబుల్‌గా మార్చినట్లు ఉందని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతోందన్న వార్తలు అసత్యాలన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు