కాంగ్రెస్‌కు ఆజాద్‌ షాక్‌.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా!

17 Aug, 2022 07:01 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాందీకి పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మంగళవారం గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు ఆయన. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలె రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్‌ ఎన్నికల నేపథ్యంతో.. పార్టీ ఆయనకు తాజా బాధ్యతలను అప్పగించింది. అయితే ఆ బాధ్యతలను ఆజాద్‌ ‘డిమోషన్‌’గా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నందున.. జమ్మూకశ్మీర్‌కు పరిమితం చేయటం తన హోదాను తగ్గించినట్లు అవుతుందని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు.. ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన గులామ్‌ అహ్మెద్‌ మిర్‌.. జమ్ము కశ్మీర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ ఆజాద్‌ అసంతృప్తితోనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవటం సైతం ప్రాధాన్యం సంతరించుకుంది. 

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో పీసీసీని సోనియా మంగళవారం పూర్తిస్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించారు. ప్రచారం కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, కోఆర్డినేషన్‌ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ, పబ్లికేషన్‌ కమిటీ, క్రమశిక్షణా కమిటీ, ఎన్నికల కమిటీలను నియమించారు సోనియా గాంధీ. పీసీసీ చీఫ్‌గా వికార్‌ వసూల్‌ వనీని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమణ్‌ భల్లాను నియమించారు. అయితే తనను ప్రచార కమిటీ చీఫ్‌గా నియమించగా.. ఆజాద్‌ ఇలా షాకిచ్చారు.

ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక

మరిన్ని వార్తలు