కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీకి ఆజాద్‌ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్‌

26 Aug, 2022 11:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌.. హస్తం పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్‌ షాక్‌ తగిలింది. 

ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా లేఖలో రాహుల్‌ గాంధీ తీరును ఆజాద్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాకే పార్టీ నాశనమైందని విమర్శలు గుప్పించారు. సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఫైర్‌ అయ్యారు. రాహుల్‌ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్‌ పక్కన పెట్టేశారంటూ పేర్కొన్నారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్‌ జోక్యం పెరిగిందని ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  కాగా, బీజేపీ మాత్రం ఆజాద్‌కు అరుదైన గౌవరం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్‌ ఇచ్చి గౌరవించింది.

మరిన్ని వార్తలు