నచ్చినప్పుడు నచ్చినంతసేపే పని

31 May, 2022 06:20 IST|Sakshi

గిగ్‌ వర్క్‌... నయా వర్కింగ్‌ ట్రెండ్‌

నచ్చిన సమయంలో పని చేసుకోవచ్చు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధోరణి

అమెరికాలో 5.7 కోట్లు, భారత్‌లో 1.5 కోట్ల గిగ్‌ వర్కర్లు

2025 కల్లా 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్న గిగ్‌ ఎకానమీ

ఇష్టమున్నప్పుడే పని చేసే అవకాశం ఉంటే! తోచిన పనిని మాత్రమే చేసే ఆస్కారం ఉంటే! ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పనిచేయాలో నిర్ణయించుకొనే అధికారం మన చేతుల్లోనే ఉంటే! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతలో ఈ ఆలోచనా ధోరణి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇలా నచ్చిన సమయాల్లో నచ్చిన పనిచేసే వారి సంఖ్య రాకెట్‌ వేగంతో పెరుగుతోంది. తమ సమయానుకూలతను బట్టి పనిచేసే వారిని ముద్దుగా ’గిగ్‌ వర్కర్స్‌’ పిలుస్తున్నారు.

అవసరం, అవకాశం మేరకు యజమాని, ఉద్యోగి స్వల్పకాలిక ఒప్పందం మేరకు చేసే పనుల ద్వారా సమకూరే ఆదాయాన్ని గిగ్‌ ఎకానమీగా పిలుస్తున్నారు. దీని పరిమాణమెంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది గిగ్‌ ఉద్యోగులున్నట్లు అంచనా. ఇక గిగ్‌ ఆర్థికవ్యవస్థ విలువ ఈ ఏడాది అక్కరాలా లక్షన్నర కోట్ల డాలర్లని మాస్టర్‌కార్డ్‌ అంచనా. ఇది 2025 కల్లా 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.

మారిన కాలం.. అందివచ్చిన అవకాశం
టెక్నాలజీలో మార్పులు, స్మార్ట్‌ఫోన్లు ఈ గిగ్‌ వ్యాపారం కొత్త పుంతలు తొక్కడానికి తోడ్పడుతున్నాయి. గిగ్‌ ఆర్థిక వ్యవస్థ ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లపైనే నడుస్తోంది. పయనీర్స్‌ నివేదిక ప్రకారం 70 శాతం గిగ్‌ వర్కర్లు గిగ్‌ వెబ్‌సైట్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో అతి పెద్ద గిగ్‌ వెబ్‌సైట్‌ ’ఆఫ్‌వర్క్‌’కు 1.5 కోట్ల సబ్‌స్క్రైబర్లున్నారు. 53 శాతం యువత స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు వెతుక్కుంది. వృత్తి నిపుణులు ఫేస్‌బుక్‌ ప్రచారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.

అమెరికాలో...
అమెరికాలో 5.7 కోట్ల గిగ్‌ వర్కర్లున్నారు. 2027 కల్లా 8.6 కోట్లకు చేరతారని అసోసియేషన్‌ ఫర్‌ ఎంటర్‌ప్రైజ్‌ అపర్చునిటీస్‌ నివేదిక పేర్కొంది.
► రెగ్యులర్‌ ఉద్యోగుల కంటే గిగ్‌ వర్కర్లు మూడు రెట్లు వేగంగా పెరుగుతున్నట్టు అంచనా.
► గిగ్‌వర్కర్ల ద్వారా 2020లో దేశ ఆర్థిక వ్యవస్థకు 1.21 లక్షల కోట్ల డాలర్లు సమకూరాయి.
► స్వతంత్ర ఉద్యోగులు అమెరికాలో వారానికి 107 కోట్ల పని గంటలు పనిచేస్తున్నారు.  
► ఫ్రీలాన్స్‌ వర్కర్లలో 51 శాతం ఎంత వేతనమిచ్చినా రెగ్యులర్‌ జాబ్‌కు నో అంటున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కంటే వీరు 78 శాతం ఎక్కువ సంతోషంగా ఉన్నారని ‘ఆఫ్‌వర్క్‌’ పేర్కొంది.
► 80 శాతం అమెరికా కంపెనీలు గిగ్‌ వర్కర్ల ద్వారా వ్యాపార విస్తరణ కోసం వ్యూహాలు మార్చుకుంటున్నాయి.

మన దేశంలో ఎలా?  
బలమైన గిగ్‌ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. కరోనాతో దెబ్బతిన్న గిగ్‌ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది.
► భారత్‌లో 1.5 కోట్ల మంది గిగ్‌ వర్కర్లున్నారు.
► మన గిగ్‌ ఆర్థిక వ్యవస్థకు 9 లక్షల రెగ్యులర్‌ ఉద్యోగులకు సమానమైన ఉపాధి కల్పించే సామర్థ్యముందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా.
► 2025 నాటికి దేశంలో గిగ్‌ వ్యాపారం 3,000 కోట్ల డాలర్లకు, అంటే రూ.2.3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా.

ఏమిటీ గిగ్‌ వర్కింగ్‌..?
ఓ కంపెనీలో నిర్ధిష్ట పనివేళల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు కాకుండా అవసరం మేరకు తాత్కాలిక పనులు చేస్తూ ఆదాయం పొందుతున్న ఫ్రీలాన్సర్లుగా గిగ్‌ వర్కర్లను చెప్పవచ్చు. ఆ లెక్కన స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ తెచ్చిచ్చే డెలివరీ బాయ్, ఓలా, ఉబర్‌ డ్రైవర్‌ గిగ్‌ వర్కర్లే. వెబ్‌ డిజైనర్లు మొదలు ప్రోగ్రామర్ల దాకా వందల వృత్తులవారు ఇలా పని చేస్తూ సరిపడా ఆదాయం పొందుతున్నారు. అమెరికాలోనైతే గిగ్‌ వర్కర్లు అత్యధిక ఆదాయం పొందుతున్నారు. కొందరు ఏటా లక్ష డాలర్లకుపైగా సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సగటు సంపాదన గంటకు 21 డాలర్లు! వీరిలో 53 శాతం 18–29 ఏళ్ల వారేనని ఓ సర్వేలో తేలింది.

– సాక్షి,నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు