‘నిమజ్జనం’లో ఏడుగురు బాలికలు మృత్యువాత

19 Sep, 2021 05:59 IST|Sakshi

లతేహార్‌: పండుగ వేళ ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ‘కరం దాలి’ నిమజ్జనానికి చెరువులోకి దిగిన ఏడుగురు బాలికలు నీట మునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బక్రు గ్రామంలో శనివారం జరిగింది. జార్ఖండ్‌ ముఖ్య పండుగల్లో ఒకటైన కర్మపూజ సందర్భంగా 10 మంది బాలికలు చెరువు వద్దకు వెళ్లారు. కదంబ కొమ్మ(కరం దాలి)ను నిమజ్జనం చేసే సమయంలో ఒక బాలిక నీటిలో పడిపోయింది.

ఆమెను రక్షించే క్రమంలో ఈతరాని మిగతా బాలికలు ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. వారి కేకలు విని గ్రామస్తులు పరుగెత్తుకుని వచ్చి అందరినీ వెలికితీశారు. వారిలో అప్పటికే నలుగురు చనిపోగా బాలూమఠ్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. బాధితులంతా స్థానిక స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న 12 నుంచి 20 ఏళ్లలోపు వారే. ఘటనకు నిరసనగా స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు అధికారులు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు