సీబీఐని నాకు అప్పగిస్తే.. వాళ్లను రెండు గంటల్లో అరెస్టు చేయిస్తా: ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌

27 Feb, 2023 17:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐని తనకు అప్పగిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని రెండు గంటల్లోనే అరెస్టు చేయిస్తానని చెప్పారు. 

డిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలతో కలిసి సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు సంజయ్. వీరిని అరెస్టు చేసిన పోలీసులు కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించవు  అని పేర్కొన్నారు.

'మోదీ నియంతృత్వానికి త్వరలోనే ముగింపు ఉంటుంది. దేశంలోనే ప్రముఖ విద్యా మంత్రిని ఆయన అరెస్టు చేశారు. కేజ్రీవాల్ ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు వల్ల ఆయనపై ఎలాంటి ప్రభావం ఉండదు. దర్యాప్తు సంస్థలతో సిసోడియాను అరెస్టు చేయించడం కేంద్రం పిరికిపంద చర్య.' అని సంజయ్ సింగ్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీశ్ సిసోడియాను ఆదివారం 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది సీబీఐ. సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.
చదవండి: సిసోడియాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ..ఐదు రోజుల కస్టడీపై తీర్పు రిజర్వ్‌..

మరిన్ని వార్తలు