హిమానీ నదాలు...శరవేగంగా కనుమరుగు...! విస్మయకర వాస్తవాలు వెలుగులోకి

10 Apr, 2023 03:20 IST|Sakshi

20 ఏళ్లలో 270 కోట్ల టన్నుల మేరకు క్షీణత

హిమాలయాల పరిమాణంలో ఇది 6.5 శాతం

హిమాలయాల్లో హిమానీ నదులు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే, గత 20 ఏళ్లలో కరిగిపోయిన హిమానీ నదాల పరిమాణం ఏకంగా 57 కోట్ల ఏనుగుల బరువుతో సమానమట! అంటే హీనపక్షం 170 కోట్ల టన్నుల పై చిలుకే...! ఈ ప్రమాదకర పరిణామాన్ని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అతి తొందర్లోనే హిమాలయాల్లో పెను మార్పులు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు... 

2000 నుంచి 2020 మధ్య కేవలం 20 సంవత్సరాల్లో హిమాలయాల్లో ప్రోగ్లేషియల్‌ సరస్సులు ఏకంగా 47 శాతం పెరిగాయి. సరస్సుల సంఖ్య పెరిగితే మంచిదే కదా అంటారా? కానే కాదు. ఎందుకంటే హిమానీ నదాలు కరిగిపోయి కనుమరుగయ్యే క్రమంలో ఏర్పడే సరస్సులివి! ఇవి ఎంతగా పెరిగితే హిమానీ నదాలు అంతగా కుంచించుకుపోతున్నట్టు అర్థం! ఈ పరిణామామంతా చాలావరకు భూమి పై పొరకు దిగువన జరుగుతుంది గనుక ఇంతకాలం పర్యావరణవేత్తల దృష్టి దీనిపై పడలేదు. కానీ ఈ సరస్సుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఈ పరిణామంపై వాళ్లు ఇటీవలే దృష్టి సారించారు.

హిమాలయాల్లో కరిగిపోతున్న హిమనీ నదాల పరిమాణాన్ని తొలిసారిగా లెక్కగట్టగా ఈ విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లోని సెయింట్‌ ఆండ్రూస్, చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ఆస్ట్రియాలోని గ్రాజ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, కార్నిగీ మెలన్‌ వర్సిటీలకు చెందిన రీసెర్చర్ల బృందంలో ఇందులో పాల్గొంది. అధ్యయన ఫలితాలను నేచర్‌ జియోసైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘హిమాలయాల వద్ద భూ ఫలకాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. దాంతో హిమానీ నదాల ప్రవాహ మార్గాలు తరచూ మారిపోతున్నాయి’’ అన్నారు.

హిమాలయాల్లో 6.5 శాతం తగ్గిన మంచు 
తాజా అధ్యయనం పలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి...
కనుమరుగవుతున్న హిమానీ నదాల రూపంలో గ్రేటర్‌ హిమాలయాలు ఇప్పటికే తమ మొత్తం మంచులో 6.5 శాతాన్ని కోల్పోయాయి. 
మధ్య హిమాలయాల్లో హిమానీ నదాల అంతర్థానం చాలా వేగంగా కొనసాగుతోంది. 
గాలోంగ్‌ కో హిమానీ నదం ఇప్పటికే ఏకంగా 65 శాతం కనుమరుగైంది. 
♦ హిమాలయాల్లో 2000–2020 మధ్య ప్రోగ్లేషియల్‌ సరస్సుల సంఖ్యలో 47 శాతం, విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది 
ఇందుకు కారణం హిమాలయాల్లోని హిమానీ నదుల పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేరకు తగ్గిపోవడమే. అంటే 1.7 లక్షల కోట్ల కిలోలన్నమాట! ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం 1,000 రెట్లు ఎక్కువ!! 
♦ ఈ ధోరణి 21వ శతాబ్దం పొడవునా కొనసాగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. 
ఫలితంగా హిమాలయాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా హిమానీ నదాలు ప్రస్తుతం భావిస్తున్న దానికంటే అతి వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు  హెచ్చరిస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు