కోవిడ్‌కి నాజల్‌ స్ప్రే చికిత్స

10 Feb, 2022 06:21 IST|Sakshi

తొలిసారిగా భారత్‌లో అందుబాటులోకి ఫ్యాబీ స్ప్రే

ముంబై: కోవిడ్‌–19 మహమ్మారితో బాధపడేవారికి చికిత్స అందించడానికి తొలిసారిగా భారత్‌లో నాజల్‌ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ బుధవారం ముక్కు ద్వారా చికిత్స చేసే నిట్రిక్‌ ఆక్సైడ్‌ స్ప్రే  విడుదల చేసింది. ఫ్యాబీ స్ప్రే అనే బ్రాండ్‌ నేమ్‌తో విడుదల చేసిన ఈ స్ప్రేని కరోనా సోకిన వయోజనుల్లో వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇది అత్యంత సురక్షితమైనదని  కంపెనీ స్పష్టం చేసింది.

కోవిడ్‌–19పై పోరాటంలో ఇప్పటికే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసిన సానోటైజ్‌ కంపెనీతో కలిసి సంయుక్తంగా గ్లెన్‌మార్క్‌ ఈ స్ప్రేను తయారు చేసింది. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ నాజల్‌ స్ప్రేని రూపొందించారు. కరోనాలో ఎన్నో కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముక్కు ద్వారా చేసే ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుందని గ్లెన్‌మార్క్‌ సీఓఓ రాబర్ట్‌ క్రోకర్ట్‌ చెప్పారు. ఔషధానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతులు కూడా లభించాయని ఆయన చెప్పారు. ఇప్పటికే పలు దశాల్లో చేసిన ప్రయోగాలతో ఈ స్ప్రే సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.  
► ఈ స్ప్రే వాడడం వల్ల 24 గంటల్లో 94% వైరస్‌ లోడు తగ్గుతోంది
► 48 గంటల్లో ఏకంగా 99% వైరస్‌ తగ్గిపోతుంది.  
► కరోనా వైరస్‌ని భౌతిక, రసాయన చర్యల ద్వారా ఈ వైరస్‌ ఎదుర్కొంటుంది.  
► వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధిస్తుంది
► అమెరికాలో ఉటా యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ స్ప్రే కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి అన్ని వేరియెంట్‌లపై రెండు నిముషాల్లోనే పని చేస్తుందని తేలింది. 99.9% సమర్థంగా పని చేస్తున్నట్టుగా వెల్లడైంది.  
► కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు  వైరస్‌ వ్యాప్తిని కూడా ఈ స్ప్రే నిరోధిస్తుంది. వైరస్‌ సోకినట్టుగా వెంటనే గుర్తించగలిగితే, వ్యాప్తిని కూడా అరికట్టే అవకాశాలుంటాయి. ఈ స్ప్రే వాడిన రెండు రోజుల్లోనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో కూడా నెగిటివ్‌ వస్తుంది.    

>
మరిన్ని వార్తలు