కాంగ్రెస్‌లో కలవరం.. బీజేపీతో టచ్‌లో కీలక నేతలు!

10 Jul, 2022 16:16 IST|Sakshi

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా మహారాష్ట్రలో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో, శివసేనకు ఊహించని షాక్‌ తగిలింది. 

ఇదిలా ఉండగా.. గోవా కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీలో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, శనివారం జరిగిన పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో వారు అధికార బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో, ఒక్కసారిగా గోవా పాలిటిక్స్‌ హీటెక్కాయి. మరోవైపు.. గోవా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ నేపథ్యంలో విపక్ష పార్టీ కాంగ్రెస్‌.. హస్తం నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం నిర్వహించింది. ఈ కీలక మీటింగ్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గైర్హాజరు అవడం హస్తం నేతలకు కలవరపాటుకు గురిచేసింది. 

అయితే, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదు. వారిలో కాగా, మైఖేల్ లోబోను కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించడంపై దిగంబర్ కామత్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. దీంతో, వీరు కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నరనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక, గోవా అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి.

ఈ వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. గోవా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఈ వదంతులను ఖండించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. కాగా, 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 25 మంది, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలున్నారు.

ఇది కూడా చదవండి: బెంగాల్‌లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు