ప్ర‌మోద్ జీ.. సీఎంగా మీకు బాధ్య‌త లేదా

5 Sep, 2020 10:00 IST|Sakshi

ప‌నాజీ : గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ సెప్టెంబ‌ర్ 2న‌(బుధ‌వారం) క‌రోనా బారీన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోవడంతో ప్ర‌స్తుతం హోంఐసోలేష‌న్‌లో ఉంటూ ముఖ్య‌మంత్రిగా త‌న విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. త‌న‌కు క‌రోనా సోకింద‌ని.. అయినా రాష్ట్రానికి సీఎంగా సేవ‌లు అందించాల్సిన బాధ్య‌త త‌న మీద ఉంద‌ని స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ప్ర‌మోద్ సావంత్ త‌న విధుల‌కు సంబంధించి కొన్ని ఫోటోల‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఆ ఫోటోలో రాష్ట్రానికి సంబంధించిన కొన్నొ ముఖ్య‌మైన ఫైళ్ల‌పై సంత‌కాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్ర‌మోద్ సావంత్ తీరును ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ త‌ప్పుబట్టింది. ముఖ్య‌మంత్రి త‌న‌ చేతుల‌కు గ్లౌజ్ వేసుకోకుండానే ఫైళ్ల‌పై సంత‌కాలు ఎలా చేస్తార‌ని విమ‌ర్శించింది. (చద‌వండి : దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది)

ఇదే విష‌య‌మై గోవా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు గిరీష్ చోదంక‌ర్ ట్విట‌ర్‌లో స్పందిస్తూ..' క‌రోనా సోకినా ప్ర‌మోద్ సావంత్ విధులు నిర్వ‌ర్తించ‌డం బాగానే ఉంది.. కానీ చేతికి క‌నీసం గ్లౌజ్ వేసుకొని సంత‌కాలు చేస్తే బాగుండేది.. ఆయ‌న సంత‌కం చేసిన ఫైళ్ల‌ను అధికారులు, ఇత‌ర సిబ్బంది ముట్టుకోవాల్సి ఉంటుంది.  ఈ నేప‌థ్యంలో వారికి క‌రోనా సోక‌ద‌ని గ్యారంటీ ఏంటి.. ప్ర‌మోద్ సావంత్ ఒక‌ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది 'అంటూ చుర‌క‌లంటించారు. 

మరిన్ని వార్తలు