దివ్యాంగురాలైన కూతురి కోసం రోబో

26 Sep, 2022 05:30 IST|Sakshi

గోవాలో ఓ దినసరి కూలీ ఘనత

పనజి: ఆయన పేరు బిపిన్‌ కదమ్‌. వయసు 40 ఏళ్లు. ఉండేది గోవాలో. పని చేసేది దినసరి కూలీగా. కదమ్‌కు ఓ 14 ఏళ్ల కూతురు. దివ్యాంగురాలు. చేతులు కదపలేదు. తినిపించడం మొదలుకుని అన్ని పనులూ దగ్గరుండి చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో రెండేళ్ల క్రితం పూర్తిగా మంచాన పడింది. కదమ్‌ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. దాంతో కూతురికి వేళకు తిండి తినిపించేందుకు ఏకంగా ఓ రోబోనే తయారు చేసేశాడు కదమ్‌! ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఎవరి సాయమూ తీసుకోకుండా ఏడాది పాటు తదేకంగా శ్రమించాడు. ఆన్‌లైన్‌ సమాచారం ఆధారంగా చివరికి సాధించాడు.

ఈ రోబో వాయిస్‌ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్‌ రైస్‌ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు కదమ్‌. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. కదమ్‌ ఘనతను గోవా ఇన్నొవేషన్‌ కౌన్సిల్‌ ఎంతో మెచ్చుకుంది. కమర్షియల్‌గా మార్కెటింగ్‌ చేసేందుకు వీలుగా రోబోను మరింత మెరుగుపరచాలని సూచించింది. అందుకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ‘‘ప్రధాని మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రోత్సహిస్తున్నారు. అదే మాదిరిగా నా కూతురు కూడా నాతోపాటు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మనిర్భర్‌గా ఉండాలన్న తపనే నాతో ఈ పని చేయించింది’’ అంటున్నాడు కదమ్‌.

మరిన్ని వార్తలు