గోవా గవర్నర్ సత్యపాల్ మేఘాలయకు బదిలీ

18 Aug, 2020 13:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు.

సత్యపాల్‌ మాలిక్ గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా పని చేశారు. 2018 ఆగస్టులో మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. అయితే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత 2019 అక్టోబర్ లో సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేస్తూ,ఆయన స్థానంలో గిరిష్‌ చంద్రముర్మును నియమించారు. కాగా, గతంలో మాలిక్ గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. గవర్నర్లకు పెద్ద పని ఏదీ ఉండదని,  గవర్నర్ గా పని చేసే వారు వైన్ తాగి, గోల్ఫ్ ఆడుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశంలో గవర్నర్ వ్యవస్థపై చర్చ కూడా జరిగింది.

మరిన్ని వార్తలు