ఇల్లంతా దోచేసి.. ప్రేమలేఖ పెట్టి పారిపోయిన దొంగలు

25 May, 2022 14:59 IST|Sakshi

Robbery in Goa: ఇటీవల దొంగలు చేస్తున్న పనులు చాలా కామెడీగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక దొంగ ఒక కిరాణాషాపుకి వచ్చి దొచుకెళ్దాం అనుకుంటే అక్కడ ఏమిలేక పోయేసరికి ఆవేదనతో ఆ షాపు ఓనర్‌కి ఒక లెటర్‌ రాసి వెళ్లిపోయాడు. మరో రాష్ట్రంలో ఏకంగా ఇరిగేషన్‌ అధికారులమని చెప్పి మరీ ఏకంగా బ్రిడ్జ్‌నే ఎత్తుకుపోయారు. అలానే ఇక్కడొక దొంగ ఇల్లంతా దోచేసి చివర్లో యజమానికి ప్రేమలేఖ రాశాడు.

వివరాల్లోకెళ్తే... గోవాకి చెందిన ఒక కుటుంబం రెండు రోజుల పాటు విహారయాత్రకు వెళ్లి ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చింది. తీరా ఇంటికి వచ్చేటప్పటికీ కాస్త అనుమానస్సదంగా అనిపించింది. అయినా అదేం పట్టించుకోకుండా వాళ్లు ఇంట్లోకి వెళ్లిపోయారు. అంతే ఇంట్లోకి ఎంటరవ్వగానే టీవీ స్క్రీన్‌పై ఐ లవ్‌ యూ అనే సందేశం కనిపించింది. దీంతో వాళ్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇదేంటి ఇలా ఉందని వెంటనే అనుమానంతో గదులన్ని తనీఖీ చేయడం మొదలు పెట్టారు.

అప్పుడు గానీ వాళ్లకు అసలు విషయం అవగతమవ్వలేదు. ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోయారని, ఇందంతా వారి పనేనని గుర్తించారు. దీంతో ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ దొంగలు బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌ పగలు గొట్టి ఇంట్లోకి చొరబడి సుమారు రూ.21 లక్షల విలువ చేసే నగలు, కొంత నగదు తీసుకుని పారిపోయారని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు